అక్షరటుడే, వెబ్డెస్క్: AI Summit Protest Row | కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్టాత్మకంగా ఏఐ సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరిగిన ఈ సదస్సుల్లో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. అంతర్జాతీయ సదస్సుల్లో యువజన కాంగ్రెస్ నాయకులు వేదిక వద్దకు చేరుకొని అర్ధనగ్నంగా ఆందోళన చేశారు. ప్రధాని మోదీ (Prime Minister Modi)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాంగ్రెస్ నాయకుల తీరుపై దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేయడానికి అనేక వేదికలు ఉన్నాయని, అంతర్జాతీయ సదసులో దేశ పరువు తీసేలా వ్యవహరించారని మండి పడుతున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సైతం స్పందించారు. యువజన కాంగ్రెస్ సభ్యులు AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (Impact Summit 2026)ను చిన్న రాజకీయ నాటకాలకు వేదికగా ఎంచుకోవడం శోచనీయం అని ఆయన అన్నారు. నిరసనల కోసం ఇంతటి ప్రపంచ వేదికను ఉపయోగించడం భారతదేశాన్ని అంతర్జాతీయంగా తక్కువ అంచనా వేస్తారని పేర్కొన్నారు.
AI Summit Protest Row | సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతుండగా..
ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదం సహజమే అయినప్పటికీ, ఎక్కడ, ఎలా నిరసన తెలియజేయాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని తెలిపారు. రాజకీయ అసమ్మతికి సమయం, ప్రదేశం ఉంటుందన్నారు. యువజన కాంగ్రెస్ వారు తమ సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అదే AI సమ్మిట్లో ప్రసంగిస్తున్న సమయంలోనే నిరసన చేపట్టారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ సహజ మూర్ఖత్వం కృత్రిమ మేధస్సును మించిపోయిందన్నారు.
AI Summit Protest Row | బీజేపీ నిరసనలు
దేశ వ్యాప్తంగా బీజేపీ (BJP) నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఏఐ సమ్మిట్లో చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన తెలపడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయం (Delhi AICC Office) ఎదుట శనివారం భారీ నిరసన చేపట్టింది రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను కార్యకర్తలు దహనం చేశారు.
AI Summit Protest Row | నలుగురి అరెస్ట్
ఢిల్లీ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ ఆందోళనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) తీర్పు రిజర్వ్ చేసింది.