అక్షరటుడే, ఇందూరు: Giriraj College | మానవమేధస్సుకు ఏఐ సహాయం చేసే పరికరమని తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు అన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ‘కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు.. అవరోధాలు’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ మేధస్సుకు సాటి ఏదీ రాదన్నారు. ఏఐని (Artificial Intelligence) విచక్షణతో మాత్రమే వాడుకోవాలన్నారు. కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సాయన్న మాట్లాడుతూ.. తక్కువ శ్రమతో ఎక్కువ సమాచారాన్ని వేగంగా విశ్లేషించడమే ఏఐ అన్నారు.
ప్రస్తుతం ఈ సేవలు ఖరీదైనవే.. కానీ భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యార్థులు కృత్రిమ మేధ ప్రభావాలను తెలుసుకొని విజ్ఞాన శాస్త్రాలను మరింత చేరువ చేయాలని తెలిపారు. అనంతరం సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల (Osmania University Science College) ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కరుణసాగర్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ సూర్యనారాయణ, వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ శ్యామ్, సదస్సు సమన్వయకర్తలు డాక్టర్ పి రామకృష్ణ, భరత్ రాజ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రంగరత్నం, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, అకడమీక్ కో–ఆర్డినేటర్ నహీదా బేగం, ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఉదయ్ భాస్కర్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.