అక్షరటుడే, ఆర్మూర్: Makloor | మాక్లూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar) సోమవారం పరిశీలించారు.
రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో (purchase centers) ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
తడిసిన ధాన్యం విషయమై రైతులు ఆందోళనకు గురి కావద్దని గడుగు గంగాధర్ (Gadugu Gangadhar) అన్నారు. ప్రభుత్వపరంగా మద్దతు ధర చెల్లిస్తూ కొనుగోలు చేయడం జరుగుతుందని భరోసా కల్పించారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు (boiled rice mills) తరలించేలా చర్యలు తీసుకున్నామని అదనపు కలెక్టర్ తెలిపారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయి లక్ష్యానికి అనుగుణంగా సాఫీగా సాగేలా కృషి చేయాలన్నారు. రైతులు (Farmers) ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీల్లో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంటదివెంట జరిగేలా, ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు.
కాగా.. రైతుల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో తాము క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తెలిపారు. వారి వెంట సివిల్ సప్లయ్స్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీఎస్వో అరవింద్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, తహశీల్దార్ శేఖర్ తదితరులున్నారు.
