అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే సిట్ అధికారులు విచారణను వేగవంతం చేయగా.. హరీశ్‌రావు విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది.
బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారులు, సినీ ప్రముఖులు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిపై కేసు నమోదు చేసింది. 2024 మార్చిలో కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు ప్రధాన నిందితులను అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల కేసు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు (SIT Officers)ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావును విచారించారు.
Phone Tapping Case | ఎమ్మెల్సీ నవీన్‌రావు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు (MLC Naveen Rao)ను సిట్ ఆదివారం విచారించింది. సుమారు 8 గంటల పాటు ఆయనను అధికారులు ప్రశ్నించారు. నవీన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రత్యేక పరికరాలు ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారని ఎమ్మెల్సీ నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. గత SIB అధికారులతో నవీన్ రావుకు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. ఇతని స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది బీఆర్ఎస్ నేతలనూ విచారించే అవకాశం ఉంది.
Phone Tapping Case | హరీశ్‌రావు విచారణకు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావు (Harish Rao) విచారణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. సిద్దిపేటకు చెందిన చక్రధర్‌గౌడ్ అనే వ్యక్తి గతంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీశ్‌రావుపై ఫిర్యాదు చేశాడు. హరీశ్‌రావు సూచనల మేరకు తన ఫోన్ ట్యాప్ చేశారని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ భూయాన్ ధర్మాసనం విచారించనుంది. మాజీ మంత్రి హరీశ్‌రావు విచారణకు కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది కొద్ది గంటల్లో తేలనుంది.