అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి అధికారులను హడలెత్తిస్తున్నారు.
ఏసీబీ (ACB) అధికారులు అవినీతి అధికారుల పని పడుతున్నారు. లంచాలు తీసుకునే వారిని వల పన్ని పట్టుకుంటున్నారు. అంతేగాకుండా పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలు, హాస్టళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేపడుతుండడం గమనార్హం.
ACB Raids | కేజీబీవీ పాఠశాలలో..
రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్, శానిటరీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఆడిటర్ సాయంతో అధికారులు పాఠశాలలో సోదాలు చేపట్టారు. ఆహార నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థుల వివరాలు, రికార్డులు తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన వంటగది, వాష్‌రూమ్‌లు, గదుల నిర్వహణ సరిగా లేకపోవడం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడం, నగదు పుస్తకం ఎంట్రీలను అప్డేట్ చేయకపోవడం వంటి అవకతవకలను అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు.
మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సైతం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ACB Raids | లంచ ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.