అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vehicles Seized | రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు (Road Accidents) పెరగడంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. తనిఖిల్లో భాగంగా పది రోజుల్లో ఏకంగా 3,420 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా (Rangareddy District) చేవెళ్ల సమీపంలో ఇటీవల ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. అంతకుముందు కర్నూల్ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus) దగ్ధమైంది. రోడ్డు ప్రమాదాలు పెరగడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఈ నెల 12న అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలన్నారు. జిల్లా స్థాయిలో 33 బృందాలు, రాష్ట్ర స్థాయిలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Vehicles Seized | అధికారుల చర్యలు
మంత్రి ఆదేశాలతో అధికారులు 33 జిల్లా స్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, 3 రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను బలిగొన్న ప్రమాదాల తర్వాత కొత్తగా ఏర్పడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు (Enforcement Teams) ఆకస్మిక తనిఖీల ద్వారా 4,748 కేసులు నమోదు చేశాయి. ఈ బృందాలు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు తనిఖీలను ప్రారంభిస్తున్నాయి. ఎవరికి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మీకంగా తనిఖీలు చేపడుతున్నాయి. దీంతో పది రోజుల్లోనే ఏకంగా 3,420 వాహనాలను అధికారులు సీజ్ చేశారు.
Vehicles Seized | ప్రమాదాల నివారణే లక్ష్యంగా..
ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ బృందాలు పని చేస్తున్నాయి. నిబంధనలు పాటించని వారిని పట్టుకోవడం, ప్రాణాంతక ప్రమాదంగా మారకముందే ఓవర్‌లోడింగ్‌ను అరికట్టడం లక్ష్యంగా వాహనాలను చెక్ చేస్తున్నారు. ఓవర్ లోడింగ్‌ను అరికట్టడానికి మైనింగ్ శాఖ (Mining Department)తో అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. దీంతో లోడింగ్ పాయింట్‌లోనే ఓవర్‌లోడింగ్ నిలిపి వేసే అవకాశం ఉంటుంది.
