అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake marriages : ఓ యువతి నిత్య పెళ్లికూతురి అవతారం ఎత్తింది. పెళ్లి పేరుతో పలువురిని మోసగించి ఉడాయించింది. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే పాతిక పెళ్లిళ్లు చేసుకున్న ఆ నిత్య పెళ్లి కూతురి ఆట కట్టించారు రాజస్థాన్ పోలీసులు(Rajasthan police). లూట్ అండ్ స్కూట్ బ్రైబ్(loot and scoot bribe)గా పేరొందిన అనురాధ పాశ్వాన్‌ను భోపాల్(Bhopal)లో సవాయి మాధోపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి కాక బాధ పడుతున్న వారిని ఆమె ముఠా టార్గెట్‌గా చేసుకునేది. నిరాశలో ఉన్న వారిని ముగ్గులోకి దింపి వారితో పెళ్లికి సిద్ధపడేది. వివాహం చేసుకున్న కొద్దిసేపటికే విలువైన వస్తువులతో ఉడాయించేది. ఇలా 23 ఏళ్ల అనురాధ పాశ్వాన్.. కేవలం ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు చేసుకుంది. తనను తాను వధువుగా చూపించుకుని, చట్టపరమైన పత్రాలను ఉపయోగించి బాధితులను వివాహం చేసుకునే. కొన్ని రోజులు అక్కడే ఉండి, బంగారం, నగదు. ఇతర విలువైన వస్తువులతో రాత్రికి రాత్రే పారిపోయేదని మన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన దర్యాప్తు అధికారి మీతా లాల్ తెలిపారు.
Fake marriages : ముఠా ఆటకట్టు..
ముగ్గురు, నలుగురు మహిళలు ముఠాగా ఏర్పడి, కొత్త తరహా దోపిడీకి తెర లేపారు. సునీత, పప్పుమీనా అనే మహిళలు.. పెళ్లి కాని యువకులను సంప్రదించి, తాము పెళ్లికూతుళ్లను సెట్ చేస్తామని చెప్పేవారు. ఇందుకు గాను రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసేవారు. ఇలాగే, మాధోపూర్‌కు చెందిన విష్ణుశర్మ నుంచి రూ.2 లక్షలు తీసుకున్నారు. అనురాధను పెళ్లి కూతురిగా చూపించి మ్యారెజ్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 20న స్థానిక కోర్టులో వారు వివాహం చేసుకున్నారు. అయితే, కొన్ని రోజుల తర్వాత అనురాధ ఇంట్లోని విలువైన వస్తువులతో సహా ఉడాయించింది. ఇది గుర్తించిన విష్ణుశర్మ మే 3న పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగడంతో ముఠా గుట్టు రట్టయింది.
Fake marriages : భర్త నుంచి విడిపోయి..
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని మహారాజ్‌గంజ్ (Maharajganj)లో గల ఓ హాస్పిటల్‌లో పని చేసే అనురాధ పాశ్వాన్.. ఇంట్లో గొడవల కారణంగా భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం భోపాల్‌కు చేరుకున్న ఆమె.. అక్కడి ఏజెంట్ల నెట్‌వర్క్ ద్వారా పనిచేసే వివాహ మోసగాళ్ల ముఠాలో చేరింది. ఈ ఏజెంట్లు వధువులు ఉన్నారని వారి ఫొటోలను వాట్సప్‌లో వైరల్ చేసే వారు. ఈ క్రమంలో వారిని సంప్రదించిన వారి నుంచి రూ. 2 నుండి రూ. 5 లక్షల వరకు డిమాండ్ చేసే వారు. ఇలా అమాయకులను చూసి అనురాధను ఎరగా వేసి డబ్బులు తీసుకుని వివాహం జరిపించే వారు. పెళ్లయిన వారం, పది రోజులకు వధువు విలువైన వస్తువులతో పరారయ్యేది.
Fake marriages : వరుడిగా వెళ్లి.. ఆట కట్టించి..
విష్ణు శర్మ ఇంటి నుంచి పారిపోయిన అనంతరం అనురాధ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇందుకోసం రూ.2 లక్షల వసూలు చేసింది. మరోవైపు, బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముఠా ఆట కట్టించేందుకు అద్భుతమైన ప్లాన్ వేశారు. ఓ కానిస్టేబుల్‌ను వరుడిగా పేర్కొంటూ సంబంధిత ముఠాను సంప్రదించారు. వారు అనురాధ ఫొటో పంపించడంతో పాటు పెళ్లికి ఏర్పాట్లు చేయగా, పోలీసులు రంగప్రవేశం చేసి ముఠా సభ్యులను అరెస్టు చేశారు. దీని వెనుక ఉన్న అనేక మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు, వీరిలో రోష్ని, రఘుబీర్, గోలు, మజ్‌బూత్ సింగ్ యాదవ్, అర్జన్ వంటి వారెందరో ఉన్నారు, వీరందరూ భోపాల్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
