అక్షరటుడే, వెబ్డెస్క్: Nandyala | ఏపీలోని నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం (Uyyalawada Mandal) తొడుములదీన్నేలో గ్రామానికి (Thodumuladinne Village) చెందిన వేములపాటి సురేంద్ర(35) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.
అతడి భార్య గతేడాది ఆగస్టులో అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుంది. వారికి ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(7),ధ్యానేశ్వరి(4), సూర్య గగన్(2) ఉన్నారు. అయితే భార్య చనిపోవడంతో సురేంద్ర వారి బాగోగులు చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలకు విషం కల్పిన పాలు తాగించాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
Nandyala | గ్రామంలో విషాదం
కొత్త సంవత్సరం వేళ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే పిల్లలను పెంచలేక సురేంద్ర ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Nandyala | కన్నవారే కడతేరుస్తున్నారు
అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఇటీవల పెరిగాయి. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లే వారు పసిప్రాణాలను తీయడానికి మాత్రం వెనుకాడటం లేదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, వివాహేతర బంధాలు.. ఇలా కారణం ఏదైతేనేమి ఇటీవల పిల్లలను తల్లిదండ్రులు చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. పిల్లలను చంపి వారు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.