అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Sanjay | పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిగా తెలంగాణ, కర్ణాటకపై దృష్టి సారిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను సంపూర్ణం చేస్తామన్నారు.
కరీంనగర్లో (Karimnagar) ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల కృషితో కమ్యూనిష్ట్ల కంచుకోట అయిన కేరళలో సైతం తమ పార్టీ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుందని గుర్తు చేశారు. బెంగాల్లో సైతం బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా.. వెనుకంజ వేయకుండా పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ కేంద్ర నాయకత్వం త్వరలో తెలంగాణపై ఫోకస్ పెడుతుందని చెప్పారు.
Bandi Sanjay | కరీంనగర్లో గెలుస్తాం
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో (municipal and corporation elections) బీజేపీ సత్తా చాటుతుందని బండి అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు తన పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని చెప్పారు. టికెట్ల విషయంలో పైరవీలకు అవకాశం లేదని స్పష్టం చేవారు. సర్వేల ఆధారంగా గెలిచే అవకాశం ఉన్న వారికే పార్టీ టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. టికెట్ల కోసం తనకు, తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేయొద్దని కోరారు. ఒత్తిడి చేస్తే టికెట్లు రావని చెప్పారు.
Bandi Sanjay | కమలం వికసించేనా..
రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న బీజేపీ కల కలగానే మారిపోతుంది. కేంద్ర నాయకత్వం దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో ఎవరికి వారే యమున తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నా.. రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోతుంది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) డిపాజిట్లు కోల్పోయిన పార్టీ, పంచాయతీ ఎన్నికల్లో సైతం ఆశించనంత రాణించలేదు. బీజేపీ పట్టణాల్లో మంచి పట్టు ఉంది. అర్బన్ ఓటర్లు కమలం పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఈ క్రమంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఎన్నో కష్టాలు అధిగమించి బీజేపీ కేరళలో తిరువనంతపురం కార్పొరేషన్‌ను గెలుచుకుంది. తెలంగాణలో ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. మరి మున్సిపల్ ఎన్నికల్లో నాయకుల పనితీరు ఎలా ఉంటుందో చూడాలి.