అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan | పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్గానిస్థాన్ (Afghanistan)తో ఘర్షణలపై స్పందిస్తూ.. భారత్‌పై ఆరోపణలు చేశారు. భారత్ చేతిలో అఫ్గాన్ కీలుబొమ్మగా మారిందన్నారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో బుద్ధి చెప్పినా.. పాకిస్థాన్ నేతల తీరులో మార్పు రావడం లేదు. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో కవ్వింపులకు పాల్పడుతున్నారు. ఓ వైపు బలూచిస్థాన్ వేర్పాటువాదులు, మరోవైపు అఫ్గానిస్థాన్ దాడులతో బిత్తరపోతున్న పాక్ ప్రభుత్వం.. ఆ నెపాన్ని భారత్‌పై నెడుతోంది. వారితో పోరాడలేక పాక్ దళాలు పారిపోతుంటే.. పాక్ మంత్రి మాత్రం ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే.. దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.
Pakistan | శాంతిచర్చలు విఫలం
పాక్–అఫ్గాన్ మధ్య కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడంతో తాలిబన్ ప్రభుత్వం ప్రతిదాడులు చేసింది. అనంతరం రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయి. దీనిపై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. కాబుల్ (Kabul)లోని ప్రజలు ఢిల్లీ నియంత్రణలో ఉన్నారన్నారు. భారత్ చేతిలో అఫ్గాన్ కీలుబొమ్మగా మారిందని విమర్శలు చేశారు. అఫ్గాన్‌తో ఒప్పందానికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా.. కొందరి జోక్యంతో అది ఉపసంహరణకు గురవుతుందని భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
Pakistan | అఫ్గాన్ హెచ్చరికలు
తుర్కియే (Turkey)లో ఇరుదేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. తమ దేశంలో దాడులకు కారణమైన ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు తాలిబన్ ప్రభుత్వం నిరాకరించడంతో విఫలమయ్యాయని పాక్ చెబుతోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ను తాలిబన్ ప్రభుత్వం హెచ్చరించింది. తమ భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా.. ఇస్లామాబాద్ లక్ష్యంగా తమ ప్రతీకార చర్యలు ఉంటాయని పేర్కొంది. మరోవైపు పాక్ రక్షణ మంత్రి సైతం.. అఫ్గాన్ బెదిరింపులపై స్పందించారు. తమ దేశంలో ఉగ్రవాదానికి అఫ్గానిస్థాన్ కారణమని ఆరోపించారు. చర్చలు విఫలమైతే.. ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయొచ్చన్నారు.
కాగా.. తమ వెనక భారత్ ఉందని పాక్ ఆరోపణలను గతంలోనే తాలిబన్లు ఖండించారు. ఇతర దేశాలకు తమ భూ భాగాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వమని స్పష్టం చేశారు. స్వతంత్ర దేశంగా భారత్‌తో సంబంధాలను కొనసాగిస్తున్నారని తెలిపారు.

