అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | గత రాత్రి ఆసియా కప్–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడగా అఫ్గానిస్తాన్ జట్టు బోణీ కొట్టింది.
అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం(Sheikh Zayed Stadium) వేదికగా జరిగిన గ్రూప్–బీ మ్యాచ్‌లో పసికూన హాంకాంగ్‌ను 94 పరుగుల భారీ తేడాతో ఓడించి అఫ్గాన్ టోర్నీని విజయంతో ఆరంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. సెదికుల్లా అటల్ 52 బంతుల్లో 73 (6 ఫోర్లు, 3 సిక్సులు), అజ్మతుల్లా 21 బంతుల్లో 53 (2 ఫోర్లు, 5 సిక్సులు), మహ్మద్ నబీ 33 పరుగులతో తమ జట్టు భారీ స్కోరు సాధించడంలో భాగం అయ్యారు.
Asia Cup | ఆట అదుర్స్.
హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా (2/24) మాత్రమే రాణించాడు. చివరి నాలుగు ఓవర్లలో అఫ్గానిస్తాన్ 69 పరుగులు రాబట్టడం గమనార్హం. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు మొదట్లోనే తడబాటుకు గురైంది. 4.3 ఓవర్లకే 22 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది. బాబర్ హయాత్ 43 బంతుల్లో 39 (3 సిక్సులు) ఒక్కరే పోరాడాడు. కెప్టెన్ యాసిమ్ ముర్తాజా (16) తప్ప మిగతా బ్యాటర్లు రెండంకెలు దాటలేకపోయారు. హాంకాంగ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 94 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో అఫ్గాన్ 94 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని విజయంతో ఆరంభించింది
అఫ్గాన్ బౌలర్స్‌లో గుల్బాదిన్ నయిబ్ 2 వికెట్లు (8 పరుగులు మాత్రమే ఇచ్చాడు) . ఫజల్ హక్ 2/16, మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హాంకాంగ్ కోలుకోలేకపోయింది. ఈ విజయంతో అఫ్గానిస్తాన్ ఆసియా కప్(Asia Cup)లో శుభారంభం చేసింది. మరోవైపు, హాంకాంగ్ బ్యాటింగ్ లైనప్‌లో ఒక్క బాబర్ హయాత్ తప్ప ఎవ్వరూ ప్రభావం చూపలేకపోయారు. దీంతో 94 పరుగులకే కుప్పకూలింది. హాంకాంగ్ ఫీల్డర్లు మూడుసార్లు క్యాచ్‌లు వదిలేయడంతో సెదికుల్లా రెచ్చిపోయి ఆడి 41 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో అఫ్టానిస్తాన్(Afghanistan) భారీ స్కోరు నమోదు చేసింది.