అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ప్రజలను పట్టి పీడిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా భయపడటం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరని ధీమాతో లంచాలు అడుగుతున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల వరకు ఎవరిని వదలడం లేదు. పలువురు అటెండర్ల నుంచి మొదలు పెడితే ఉన్నతాధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ.. ఇరిగేషన్ శాఖ ఏఈఈ (Irrigation AEE) ఏసీబీ అధికారులకు చిక్కాడు.
మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా నీటి పారుదల శాఖ సబ్‌డివిజన్–1లో మహమ్మద్ ఫయాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE)గా పనిచేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎల్ఆర్ఎస్ (LRS) కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ప్లాట్ తనిఖీ నివేదికను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఎన్వోసీ ఇవ్వడానికి ఏఈఈ రూ.మూడు వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ క్రమంలో బుధవారం ఫిర్యాదుదారుడి నుంచి రూ.మూడు వేల లంచం తీసుకుంటుండగా.. ఏఈఈ మహమ్మద్ ఫయాజ్ను ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.