అక్షరటుడే, వెబ్‌డెస్క్: Adulterated Milk Deaths Rajahmundry | ఏపీలోని రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పలువురు బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందారు. అంతకుముందు చౌడేశ్వరి నగర్ (Chowdeshwari Nagar)కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం సహా మరొకరు చనిపోయారు. నలుగురు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైనట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ ప్రాంతంలో వైద్యారోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. కల్తీ పాల (Adulterated Milk)తోనే ఈ సమస్య తలెత్తినట్లు గుర్తించారు.
Adulterated Milk Deaths Rajahmundry | పాల వ్యాపారి అరెస్ట్
మృతి చెందిన వారు, అస్వస్థతకు గురైన వారు ఒకరి దగ్గరే పాలు కొన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాలు కల్తీ కావడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం (Korukonda Mandal) నరసాపురం గ్రామానికి చెందిన గణేష్‌ను అరెస్ట్ చేశారు. అతడికి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరికి సరఫరా చేస్తున్నాడని ఆరా తీస్తున్నారు. కాగా గణేశ్ 150 కుటుంబాలకు పాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
Adulterated Milk Deaths Rajahmundry | సీఎం సమీక్ష
కల్తీ పాల ఘటనలో ఐదుగురు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానికంగా పరిశీలించారు. పాలు, నీళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కల్తీ పాల ఘటనపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం సమీక్షించారు. కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ అధికారులతో మాట్లాడారు. బాధితులకు మైరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ల్యాబ్ రిపోర్టులు వచ్చాక.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
