అక్షరటుడే, వెబ్‌డెస్క్: Parliament Sessions | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ఎలాంటి చర్చలు, కార్యకలాపాలు లేకుండానే నాలుగు రోజులుగా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాల వైఖరి వల్ల ప్రజా ధనం భారీగా వృథా అవుతోంది. సభ నిర్వహణకు నిమిషానికి రూ.2.50లక్షల చొప్పున రోజుకు రూ.25.58 కోట్ల మేర ప్రజల సొమ్ము ఖర్చవుతోంది. ఇదేదీ పట్టించుకోని విపక్షాలు ఆందోళనలతో సభలను హోరెత్తిస్తున్నాయి.
Parliament Sessions | దద్దరిల్లుతున్న ఉభయ సభలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు (Parliament Monsoon Sessions) సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు నుంచే ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో దద్దరిల్లుతున్నాయి. ఇప్పటివరకు ఎటువంటి సభా వ్యవహారాలు జరగలేదు. ఆపరేషన్ సిందూర్‌తో పాటు బీహార్‌లో చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision)పై చర్చ జరపాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. వీటితో పాటు అన్ని అంశాలపై చర్చిందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించినా, విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 8 గంటలు పాటు చర్చించాలని నిర్ణయించారు. అయినప్పటికీ, ప్రతిపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తుండడంతో వాయిదాల పర్వం కొనసాగుతోంది.
Parliament Sessions | నిలిచిన కీలక బిల్లులు
ప్రస్తుత సమావేశాల్లో అనేక కీలక బిల్లులపై ఉభయ సభలు చర్చించి ఆమోదించాల్సి ఉంది. కానీ సభలు వాయిదా పడుతుండడంతో ఈ బిల్లులు నిలిచి పోతున్నాయి. మణిపూర్(Manipur) లో ఆందోళనలు, వస్తువు సేవల పన్ను (సవరణ) బిల్లు 2025, పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025, నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు 2025 వంటి ప్రధాన బిల్లులు చర్చించాల్సి ఉంది. కానీ, విపక్షాల ఆందోళనలతో తరచు వాయిదాలు వేయడం వల్ల పురోగతి నిలిచిపోతుంది.
Parliament Sessions | భారీగా ప్రజాధనం ఖర్చు..
సభలకు తరచూ అంతరాయం కలిగి కీలక బిల్లులు నిలిచి పోతుండడం పెను ప్రభావాన్ని చూపిస్తోంది. వాస్తవానికి సభ నిర్వహణకు నిమిషానికి రూ.2.50 లక్షల చొప్పున ప్రజా ధనం వృథా అవుతోంది. కొంతకాలంగా ఉభయ సభల పనితీరు దారుణంగా పడిపోయింది. వాయిదాల వల్ల పార్లమెంట్ పని గంటలు గణనీయంగా తగ్గిపోయాయి.PRS లెజిస్లేటివ్ రీసెర్చ్ (PRS) నివేదిక ప్రకారం అత్యంత తక్కువగా సమావేశాలు జరుగుతున్నట్లు తేలింది.