అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Minister Seethakka | ఆదివాసులు.. గిరిజనులు అమాయకులని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని హరిత హోటల్లో (Haritha Hotel) తెలంగాణ ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ (Indira Gandhi) హయాం నుండి ఇప్పటిదాకా ఆదివాసీల కోసం, దళిత గిరిజనులకు సమాజంలో సమానత్వం కోసం నేటి వరకు పనిచేస్తూనే ఉందన్నారు. కులగణనపై తెలంగాణలో చేసిన సర్వేపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.
Minister Seethakka | గిరిజన హక్కులకు కట్టుబడి ఉన్నాం..
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ (Shabbir ali) మాట్లాడుతూ జల్-జమీన్-జంగిల్పై గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ (Rahul gandhi) యాత్ర చేశారని గుర్తు చేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలనేదే మన అందరి కల అని షబ్బీర్ అన్నారు. ఈ కల సాకారం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజనుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.