అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో రెండు మెయిన్‌బోర్డ్ కంపెనీలు కాగా.. ఒకటి ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు చెందినది. మెయిన్‌బోర్డ్‌లో ఆదిత్య బంపర్ లిస్టింగ్ గెయిన్స్ అందించగా.. లక్ష్మి ఇండియా ఫైనాన్స్ (Lakshmi India Finance) నిరాశ పరిచింది. ఇక ఎస్‌ఎంఈకి చెందిన కాయ్‌టెక్స్ ఫ్యాబ్రిక్స్ ఇన్వెస్టర్లలను నిండా ముంచింది.
Aditya Infotech | ఆదిత్య ఇన్ఫోటెక్..
ఆధునిక భద్రత, నిఘా పరికరాల వ్యాపారం చేసే ఆదిత్య ఇన్ఫోటెక్ (Aditya Infotech) సంస్థ షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఈ కంపెనీ తొలిరోజే ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఇది పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవోకు వచ్చింది. గతవారంలో సబ్‌స్క్రిప్షన్ స్వీకరించారు. దీనికి విశేష స్పందన లభించింది. రిటైల్ కోటా 53.81 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యాయి.
ఒక రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్‌ను రూ. 675కు విక్రయించింది. అయితే 50.37 శాతం ప్రీమియంతో 1,015 వద్ద ట్రేడిరగ్ ప్రారంభించాయి. అంటే ఐపీవో అలాట్ అయినవారికి ఒక్కో షేరుపై రూ. 340 లాభం వచ్చిందన్న మాట. ఐపీవోలో ఒక లాట్‌లో 22 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఒక లాట్ కోసం రూ. 14,850 తో దరఖాస్తు చేసుకోగా.. ఐపీవో అలాట్ అయినవారికి తొలిరోజే 7,480 రూపాయల లాభం వచ్చిందన్న మాట. ఈ కంపెనీ షేర్లు లిస్టింగ్ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కో షేరు ధర రూ.. 1,075 వద్ద ఉంది.
Aditya Infotech | లక్ష్మి ఇండియా ఫైనాన్స్..
లక్ష్మి ఇండియా ఫైనాన్స్ ఐపీవో ద్వారా రూ. 254.26 కోట్లు సమీకరించింది. ఈ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ (IPO Subscription) 29న ప్రారంభమై 31న ముగిసింది. రిటైల్ ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 2.2 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయ్యింది. కంపెనీ షేర్లు మంగళవారం లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 158 కాగా.. 12.96 శాతం డిస్కౌంట్‌తో రూ. 137.52 వద్ద లిస్టయ్యింది. అంటే ఒక్కో షేరుపై రూ. 20.48 నష్టం వచ్చిందన్న మాట. లిస్టింగ్ తర్వాత కొంత కోలుకుని ఒక్కో షేరు ధర రూ. 10 వరకు పెరిగినా.. తర్వాత మళ్లీ అమ్మకాల ఒత్తిడితో లిస్టింగ్ ప్రైస్ వద్దకే చేరింది.
Aditya Infotech | కాయ్‌టెక్స్ ఫ్యాబ్రిక్స్..
ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌కు (SME Segment) చెందిన కాయ్‌టెక్స్ ఫ్యాబ్రిక్స్ రూ. 66.31 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. రిటైల్ కోటా 47.85 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇన్వెస్టర్లు రెండు లాట్ల(1,600 షేర్లు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కంపెనీ షేర్లు మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఒక్కో షేరు ధర రూ. 180.. కాగా 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 144 వద్ద లిస్ట్ అయ్యింది. ఒక్కో షేరుపై రూ. 36 నష్టాన్ని మిగిల్చింది. అంటే ఒక్కో ఇన్వెస్టర్లు తొలిరోజే రూ. 57,600 నష్టపోయారన్న మాట. లిస్టింగ్ తర్వాత మరో ఐదు శాతం క్షీణించి లోయర్ సర్క్యూట్‌ను తాకినా.. తర్వాత కోలుకుని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రూ. 151 వద్ద కొనసాగుతోంది.