అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. లంచం తీసుకుంటుండగా విద్యుత్ శాఖ అధికారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ ఘటన నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో చోటు చేసుకుంది.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి (Kalwakurthy) సబ్ డివిజన్లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE)గా పనిచేస్తున్న ఎద్దుల వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ వ్యక్తి ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్మర్ (Transformer) ఏర్పాటు చేయడంతో పాటు అతని పేరు మీద మీటర్ అందించడానికి ఏడీఈ రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడి నుంచి రూ.15 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు మంగళవారం ఏడీఈ వెంకటేశ్వర్లును పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
ACB Raid | అవగాహన కల్పిస్తున్నా..
రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా అవినీతి నిరోధక వారం పేరిట పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. పోస్టర్లు ఆవిష్కరించడంతో పాటు, ర్యాలీలు, అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. లంచాలు తీసుకోవద్దు, ఇవ్వొద్దని కోరుతున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.