అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Railway Minister | రైల్వే ప్రయాణికులకు మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnaw) షాకింగ్ న్యూస్ చెప్పారు. పరిమితికి మించి లగేజీ తీసుకు వెళ్లే వారు అదనపు ఛార్జీలు చెల్లించాలని స్పష్టం చేశారు.
విమానాల్లో ఒక్కో ప్రయాణికుడు (passenger) కొంత లగేజీ మాత్రం ఉచితంగా తీసుకు వెళ్లే నిబంధన ఉంది. అంతకంటే ఎక్కువ బరువు తీసుకు వెళ్తే.. అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రైళ్లలోనూ ఇలాంటి నిబంధన ఉంది. అయితే అది ఎక్కడ అమలు కావడం లేదు. స్టేషన్లలో సరైన సదుపాయలు లేక.. ప్రయాణికుల సామగ్రిని ఎవరు కూడా తనిఖీ చేయడం లేదు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం లోక్‌సభలో ప్రశ్న అడిగారు. విమానాల మాదిరిగా పరిమితికి మించి లగేజీ తీసుకెళితే రైళ్లలో అదనపు ఛార్జీలు వసూలు చేసే నిబంధనలు ఉన్నాయా అని ఆయన అడిగారు. దీనిపై రైల్వే శాఖ మంత్రి సమాధానం ఇస్తూ.. అదనపు లగేజీ తీసుకువెళ్తే ఛార్జీలు చెల్లించాలని తెలిపారు.
Railway Minister | ఛార్జీల వివరాలు..
ప్రయాణికులు తమతో పాటు కంపార్ట్మెంట్లలోకి తీసుకువెళ్లే సామానుకు తరగతుల వారీగా గరిష్ట పరిమితిని నిర్దేశించినట్లు మంత్రి తెలిపారు. సెకండ్ క్లాస్‌లో ప్రయాణికులు 35 కిలోల సామానును ఉచితంగా, 70 కిలోల వరకు రుసుము చెల్లించి తీసుకువెళ్లవచ్చు. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత పరిమితి 40 కిలోలు కాగా, గరిష్టంగా 80 కిలోల వరకు అనుమతి ఉంది. ఏసీ 3 టైర్ లేదా చైర్ కార్లో ప్రయాణించే వారు 40 కిలోల వరకు ఉచితంగా తీసుకు వెళ్లొచ్చు. డబ్బులు చెల్లించి అదనంగా తీసుకు వెళ్లే అవకాశం లేదు. ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కిలోల సామానును ఉచితంగా, గరిష్టంగా 100 కిలోల వరకు తీసుకు వెళ్లొచ్చు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల లగేజీ ఉచితంగా, గరిష్టంగా 150 కిలోల వరకు డబ్బులు చెల్లించి తీసుకు వెళ్లే అవకాశం ఉంది. వాణిజ్య వస్తువులను వ్యక్తిగత సామగ్రిగా కంపార్ట్మెంట్లో బుక్ చేయడానికి, తీసుకువెళ్లడానికి అనుమతి లేదని మంత్రి స్పష్టం చేశారు.