అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Online Shopping | ప్రజలు ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డారు. మహా నగరాల నుంచి మారుమూల పల్లెల వరకు ఈ కామర్స్ (e-commerce) సంస్థలు వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. దీంతో వాటికి గిరాకీ పెరిగింది.
ప్రజలు ఈ–కామర్స్ సైట్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేస్తుండటం పెరిగింది. దీంతో ఆయా సంస్థలు వినియోగదారులపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. గతంలో ఉచిత డెలివరీలు చేసిన సంస్థలు ఇటీవల ప్లాట్‌ఫామ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంతేగాకుండా క్యాష్ ఆన్ డెలివరీ (COD)లకు సైతం అదనపు ఛార్జీలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి సంస్థలపై దర్యాప్తు ప్రారంభించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ (Union Minister Prahlad Joshi) తెలిపారు.
Online Shopping | కఠిన చర్యలు తీసుకుంటాం
ఈ-కామర్స్ సంస్థల ఛార్జీలపై ఓ వ్యక్తి ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వర్షాలు పడుతున్న సమయంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు విధించే ఫీజులు ఒకే అయినా.. చాలా ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆఫర్ హ్యాండ్లింగ్, పేమెంట్ హ్యాండ్లింగ్, ప్రొటెక్ట్ ప్రామిస్ అంటూ ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. అంతేగాకుండా క్యాష్ ఆన్ డెలివరీలకు సైతం డబ్బులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌కు కేంద్రమంత్రి జోషీ స్పందించారు.
క్యాష్ ఆన్ డెలివరీ ఎంచుకున్న వినియోగదారులకు కొన్ని సంస్థలు అదనపు ఛార్జీలు వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించి, దోపిడీ చేయడమే అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాంటి ప్లాట్‌ఫామ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.