అక్షరటుడే, బోధన్: Ration cards | రేషన్ కార్డుల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే అధికారులను సస్పెండ్ చేయిస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఆదివారం పలువురు లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకే రేషన్ కార్డులు అందాలని అధికారులకు సూచించారు. అనర్హులకు కేటాయించినట్లు తెలిస్తే మాత్రం సంబంధిత అధికారుల సస్పెన్షన్ తప్పదని పేర్కొన్నారు. ఎడపల్లి మండలంలో వెయ్యి మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా 644 మందికి కార్డులు పంపిణీ చేశామన్నారు.
Raion cards | పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని కానీ తాము అధికారంలోకి రాగానే ఆహార భద్రత కార్డులు అందజేస్తున్నామని చెప్పారు. అనంతరం 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బిన్ హందాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీసీసీబీ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ రజిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.