అక్షరటుడే, ఆర్మూర్: Armoor | ప్రభుత్వ భూమిని ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి(Real estate agent) తీగల నర్సారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ (CPIML NewDemocracy) జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ (Armoor Municipality) కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ.. పట్టణ పరిధిలోని పెర్కెట్‌లో సర్వే నంబర్ 202/3 ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి, సదరు స్థలంలో 24 ఇళ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తికి అనుమతి ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు, వాస్తవాలను పట్టించుకోకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మద్దతుగా ఎలా ఉంటారన్నారు.
ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు సూర్య శివాజీ, అబ్దుల్, బాలయ్య, ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్, వెంకటేష్, నరేందర్, పాషా బాయ్, హన్మంత్ రెడ్డి, రాహుల్, కాజా పటేల్ తదితరులు పాల్గొన్నారు.

