అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలో అక్రమాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారిపై (real estate businessman) చర్యలు తీసుకోవాలని న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
అనంతరం సబ్‌కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు (Sub-Collector Abhigyan Malviya) వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. ఆ స్థలాన్ని వెంటనే కబ్జా నుంచి విడిపించి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.
ఆర్మూర్ పట్టణ మున్సిపల్ పరిధిలోని (Armoor Municipal Corporation) పెర్కిట్‌లో సర్వేనెంబర్ 202/3 ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి 24 ఇళ్లు నిర్మిస్తున్నారని వివరించారు. ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తికి అనుమతి ఎలా ఇస్తారని ఆయన సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సబ్ కలెక్టర్ తనిఖీలు చేస్తామని చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి. ప్రజలకు నష్టం జరుగుతుందని వివరించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మద్దతుగా నిలవడం విచారకరమన్నారు. ధర్నాలో న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు బి.సూర్య శివాజీ, అబ్దుల్, బాలయ్య, దేవన్న, ప్రజా సంఘాల నాయకులు ఆర్.బాబురావు, వెంకటేష్, నరేందర్, హుస్సేన్, వర్ణారెడ్డి, రాహుల్, పోశెట్టి, సూరిబాబు, నిమ్మల భూమేష్, తదితరులు పాల్గొన్నారు.
