అక్షరటుడే, వెబ్డెస్క్: MLA PA | విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఓ ఉపాధ్యాయుడు ప్రజాప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్న ఘటనపై నిజామాబాద్ డీఈవో అశోక్ (Nizamabad DEO Ashok) ఎట్టకేలకు స్పందించారు.
సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిపై (teacher Srinivas Reddy) చర్యలకు ఉపక్రమించారు. అనధికారికంగా సెలవులో ఉండడమే కాకుండా.. ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తున్న ఉదంతంపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. సత్వరమే వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే పీఏపై అతిత్వరలోనే శాఖాపరమైన చర్యలు ఉండవచ్చని తెలుస్తోంది. విద్యాహక్కు చట్టం (Education Act) నిబంధనల ప్రకారం.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులకు పీఏలుగా విధులు నిర్వహించకూడదు.
ఈ విషయమై గతంలోనే సుప్రీంకోర్టు (Supreme Court) సైతం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాలు సైతం ఉపాధ్యాయులను పీఏలుగా నియమించడంపై నిషేధం విధించాయి. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి (జీవోల శ్రీనివాస్ రెడ్డి) నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి (MLA Bhupathi Reddy) పీఏగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈయన పోస్టింగ్ ధర్పల్లి మండలం మైలారం ఉన్నత పాఠశాల. కాగా.. రెండేళ్లుగా ఆయన బడికి మొహం చాటేశారు. సంబంధిత మండల ఎంఈవో వద్ద ప్రతి నాలుగు నెలలకోసారి సెలవులు పెట్టి.. ఎమ్మెల్యే వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఈ తంతు దాదాపు గత రెండేళ్లుగా కొనసాగుతోంది. పైపెచ్చు గతంలో జీతభత్యాలు కూడా జారీ చేయడం గమనార్హం.
MLA PA | ఎంఈవో అండదండలు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వద్ద పీఏగా కొనసాగడం వెనుక స్థానిక ఎంఈవో అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు సొంత నియోజకవర్గంలో శ్రీనివాస్ రెడ్డి పనిచేసే పాఠశాల ఉండడంతో దాదాపు నెలల తరబడిగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఎమ్మెల్యేతో పలుమార్లు డీఈవో, ఎంఈవో (DEO and MEO) అధికారికంగా వేదికలు పంచుకున్న సమయంలో సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి అక్కడే ఉన్నా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించారు. చివరకు ఓ వ్యక్తి దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ (RTI petition), ‘అక్షరటుడే’లో ప్రచురితమైన కథనాల ఆధారంగా విద్యాశాఖ అధికారులు స్పందించారు.
MLA PA | సత్వరమే వివరణ ఇవ్వాలని ఆదేశం
శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో డీఈవో అశోక్ విచారణ జరిపించారు. ఎంఈవోను రంగంలోకి దించి క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయించారు. కాగా.. ప్రతి నాలుగు నెలలకొకసారి శ్రీనివాస్ రెడ్డి అకారణంగా సెలవు పెట్టి వెళ్తున్నట్లు గుర్తించారు. తిరిగి ఒకరోజు విధుల్లో చేరి మరుసటి రోజే మళ్లీ నాలుగు నెలలు సెలవు తీసుకుని గత రెండేళ్లుగా ఎమ్మెల్యే వద్ద పీఏగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
ఈ విషయమై స్థానిక ఎంఈవో డీఈవోకు తుది నివేదిక అందించారు. 125 రోజులు అనధికారిక సెలవులో (unofficial leave) ఉండడమే కాకుండా ఎమ్మెల్యే వద్ద పీఏగా కొనసాగుతున్నట్లు నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన డీఈవో అశోక్ ఎట్టకేలకు స్కూల్ అసిస్టెంట్, ఎమ్మెల్యే పీఏగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి గడువు విధించకుండా సత్వరమే వివరణ ఇవ్వాలని నోటీసులో సూచించారు. వివరణ అనంతరం శ్రీనివాస్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు.
