అక్షర టుడే, ఇందల్వాయి: Telangana University | సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని తెయూ వీసీ ప్రొఫెసర్ ఎం యాదగిరి రావు (TAU VC Professor M Yadagiri Rao) అన్నారు. వర్సిటీలో అర్థశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్ ఇండియా 2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సెమినార్ రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 1992లో 178 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఎర్త్ సమ్మిట్ నిర్వహించాయని, అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సమ్మిట్ అభిప్రాయపడిందని గుర్తు చేశారు.
ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ ద్వారా పేదరికాన్ని 2015 నాటికి తగ్గించాలని నిర్దేశించుకున్నారన్నారు. ఇదే దిశలో భారతదేశంలో 2047 నాటికి సాధికారత గల దేశంగా ఎదగడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను నిర్ధారించుకుని, సాధించడానికి వ్యూహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రెండురోజుల జాతీయ సెమినార్ విజయవంతంగా పూర్తి చేసిన విభాగం కన్వీనర్, ప్రొఫెసర్లను అభినందించారు. ముగింపు కార్యక్రమానికి గౌరవ అతిథులుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యులు (Hyderabad Central University Professors) రాణి రత్నప్రభ, చిట్టేడు కృష్ణారెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆచార్యులు కే కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా సరస్వతి, శ్రద్ధానందం, సౌందర్య, సిద్ధలక్ష్మి, సుజాత సంధానకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, నాగరాజు పాత, స్వప్న, వివిధ వర్సిటీల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.