అక్షరటుడే, ధర్పల్లి: Dharpally | వివాహిత హత్యకేసులో నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ భిక్షపతి (CI Bhikshapati) తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. మండలానికి చెందిన కోటగిరి గంగాధర్‌కు నాగమణితో వివాహం కాగా, మనస్పర్థలతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు.
కాగా, తమ మధ్య గొడవలకు మచ్చ లక్ష్మి, ఆమె భర్త భోజేశ్వర్ కారణమని అనుమానించిన నిందితుడు గంగాధర్ ఈనెల 2న లక్ష్మి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తెరతో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆమె కూతురు గౌతమి అడ్డు రాగా, ఆమెపైనా దాడికి పాల్పడ్డాడు. వారి అరుపులు విన్న ఇరుగుపొరుగు చేరుకుని అడ్డుకోగా, వారిని కూడా గాయపర్చాడు. అక్కడి నుంచి కిరాణ దుకాణంలో ఉన్న భోజేశ్వర్ వద్దకు వెళ్లి గాయపర్చాడు.
తీవ్ర గాయాలపాలైన లక్ష్మిని నిజామాబాద్‌లోని జీజీహెచ్ (GGH Nizamabad) ఆస్పత్రికి తరలించగా, ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో నిందితుడు గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. అతని వద్ద నుంచి కత్తెర స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.