అక్షరటుడే, ఇందూరు: Desk Journalists | తమకు పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు (Desk journalists) ఆందోళనకు దిగారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద డీజేఎఫ్టీ (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా) శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం డెస్క్ జరల్నిస్టులకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు.
ఇందుకోసమే జీవో 252ను తీసుకువచ్చిందని ఆరోపించారు. అక్రెడిటేషన్ కార్డు (accreditation cards), మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలని కుట్ర పన్నిందని మండిపడ్డారు. తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మరీ రాత్రి సమయాల్లో పనిచేస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. కానీ సర్కారు మాత్రం వివక్ష చూపిస్తోందని.. ఇది సరైనది కాదని పేర్కొన్నారు. జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు.
Desk Journalists | టీయూడబ్ల్యూజే (143) మద్దతు
డెస్క్ జర్నలిస్టుల ఆందోళనకు వివిధ జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. టీయూడబ్ల్యూజే (143) తదితర సంఘాల నాయకులు డెస్క్ జర్నలిస్టులకు మద్దతుగా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులందరూ ఒకటేనని.. ప్రభుత్వం ఇలా విలేకరులు, డెస్క్ జర్నలిస్టులను విభజించి చూడడం సరికాదని పేర్కొన్నారు. జర్నలిస్టులను విభజించే కుట్రను మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో జర్నలిస్టులకు అన్యాయం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే 252 జీవోను సవరించి డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు జమాల్పూర్ గణేశ్, రామకృష్ణ, సుభాష్, పంచరెడ్డి శ్రీకాంత్, భూపతి, సీనియర్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
Desk Journalists | జీవో 252ను వ్యతిరేకిస్తున్నాం..
డెస్క్ జర్నలిస్టులు చేపట్టిన నిరసనకు టీడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు తెలిపింది. ప్రభుత్వం జీవో 252 విడుదల చేసిన నాటి నుంచి ఫెడరేషన్ వ్యతిరేకిస్తూ వస్తోందని యూనియన్ నాయకుడు రాంచందర్ తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని పేర్కొన్నారు. డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామన్నారు.

