అక్షరటుడే, వెబ్డెస్క్: Bapatla | ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్ క్వారీలో (Granite quarry) అంచు విరిగి పడడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో సత్య కృష్ణ గ్రానైట్ క్వారీ ఉంది. ఈ క్వారీలో ఆదివారం కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో బండరాళ్లు విరిగిపడడంతో ఆరుగురు మృతి చెందారు.
గ్రానైట్ క్వారీలో ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు (Rescue Operation) చేపట్టారు. నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా ఒడిశాకు చెందిన వారని సమాచారం. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Bapatla | సీఎం చంద్రబాబు ఆరా
బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పందించారు. ఘటనపై ఆయన అధికారులతో మాట్లాడారు. వివరాలు ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలనపై విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు.