Homeభక్తిAmarnath Yatra | అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో ప్ర‌మాదం.. బ‌స్సు బోల్తా ప‌డి 36 మందికి గాయాలు

Amarnath Yatra | అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో ప్ర‌మాదం.. బ‌స్సు బోల్తా ప‌డి 36 మందికి గాయాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amarnath Yatra | అమ‌ర్‌నాథ్ యాత్ర సంద‌ర్భంగా జరిగిన బ‌స్సు ప్ర‌మాదం (Bus Accident) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో 36 మంది గాయ‌ప‌డ్డారు. శనివారం ఉదయం జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఐదు బస్సులు ఢీకొన్నాయి. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మార్గంలోని చందర్‌కూట్ సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్తున్న కాన్వాయ్‌లో ఈ బస్సులు ఉన్నాయి. ఓ బస్సు బ్రేక్ ఫెయిల్ (Bus Brake Failure) కావడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు. “పహల్గామ్ వెళ్తున్న కాన్వాయ్‌లోని చివరి వాహనం చందర్‌కూట్ లాంగర్ సైట్ వద్ద నియంత్రణ కోల్పోయి.. పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఢీకొట్టింది. నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. 36 మంది యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి” అని రాంబన్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ అలియాస్ ఖాన్ (Mohammad Alias ​​Khan) తెలిపారు.

Amarnath Yatra | ఆస్పత్రికి క్షతగాత్రుల త‌ర‌లింపు

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే అధికారులు స్పందించారు. క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన రాంబన్ జిల్లా ఆసుపత్రి (Ramban District Hospital)కి తరలించారు. సీనియ‌ర్ పోలీసు అధికారులు ఆస్ప‌త్రిలోనే ఉండి వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన యాత్రికుల‌ను ప్ర‌త్యామ్నాయ వాహ‌నాలు ఏర్పాటు చేసి త‌ర‌లించారు. గాయపడిన యాత్రికులందరికీ ప్రథమ చికిత్స అందించి, కొద్దిసేపటికే డిశ్చార్జ్ చేసినట్లు రాంబన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుదర్శన్ సింగ్ కటోచ్ (Dr. Sudarshan Singh Katoch) తెలిపారు. దెబ్బతిన్న బస్సులను మార్చిన తర్వాత కాన్వాయ్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించిందని అధికారులు ధ్రువీకరించారు.

Amarnath Yatra | ఆందోళ‌న అక్క‌ర్లేదు..

అమ‌ర్‌నాథ్ యాత్ర‌లో జ‌రిగిన ప్ర‌మాదంపై కేంద్ర ప్ర‌భుత్వం (Central Government) ఆరా తీసింది. సంబంధిత అధికారుల‌తో మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Union Minister Jitendra Singh) ‘X’లో తెలిపారు. “చంద్రకోట్ వద్ద అమర్‌నాథ్ యాత్రికులను తీసుకెళ్తున్న వాహనం ప్ర‌మాదానికి గురైంద‌ని తెలిసి అధికారుల‌తో మాట్లాడాను. 36 మంది యాత్రికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి రాంబన్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు. యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి.” అని తెలిపారు.

Amarnath Yatra | యాత్ర‌కు బ‌య‌ల్దేరిన 7వేల మంది

6,900 మంది భ‌క్తుల‌తో కూడిన నాలుగో బ్యాచ్ శ‌నివారం తెల్ల‌వారుజామున అమ‌ర్‌నాథ్ ద‌ర్శ‌నానికి బ‌య‌ల్దేరింది. 5,196 మంది పురుషులు, 1,427 మంది మహిళలు, 24 మంది పిల్లలు, 331 మంది సాధువులతో కూడిన ఈ బ్యాచ్ భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి తెల్లవారుజామున 3.30 గంట‌ల‌కు రెండు కాన్వాయ్‌లలో బయలుదేరింది. 161 వాహనాలలో 4,226 మంది యాత్రికులు సాంప్రదాయ 48 కిలోమీటర్ల పహల్గామ్ మార్గం ద్వారా నున్వాన్ బేస్ క్యాంప్‌కు వెళుతుండగా, 2,753 మంది యాత్రికులు 151 వాహనాలలో తక్కువ కానీ నిటారుగా ఉన్న 14 కిలోమీటర్ల బాల్టాల్ మార్గంలో వెళ్తున్నారు.