అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dubai Air Show | దుబాయ్‌లోని అల్ మక్తూం అంతర్జాతీయ విమానాశ్రయంలో (Al Maktoum International Airport) కొనసాగుతున్న దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం భారత వాయుసేనకు (Indian Air Force) చెందిన స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ మార్క్-1 యుద్ధవిమానం నియంత్రణ కోల్పోయి నేలకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అద్భుతమైన ఏరోబాటిక్ విన్యాసాలు ప్రదర్శిస్తున్న తేజస్ ఒక్కసారిగా ఎత్తు తగ్గి రన్‌వే సమీపంలో కూలిపోయింది. ఘటనా స్థలంలో నల్లని పొగ కమ్మేసింది. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక బృందాలు చేరుకుని మంటలను ఆర్పివేశాయి.
భారత వాయుసేన ఈ దుర్ఘటనను ధ్రువీకరించింది. “దుబాయ్ ఎయిర్ షోలో ఏరియల్ డిస్‌ప్లే సమయంలో మా తేజస్ విమానం (Tejas aircraft) దుర్ఘటనకు గురైంది. ఈ ఘటనలో పైలట్ ప్రాణాంతక గాయాలపాలై మరణించడం బాధాకరం. మృతుడి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలుస్తాం. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటు చేస్తున్నాం” అని ఐఏఎఫ్ తెలిపింది.
