అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. వరుస దాడులతో అవినీతి అధికారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.
ఏసీబీ అధికారులు (ACB Officers) ఆగస్టులో మొత్తం 31 కేసులు, విచారణలు నమోదు చేశారు. ఇందులో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు, మూడు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, ఏడు సాధారణ తనిఖీలు, నాలుగు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. నలుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులు సహా 22 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ACB Raids | భారీగా నగదు స్వాధీనం
ఏసీబీ అధికారులు లంచాలు తీసుకుంటున్న అధికారులను వల పన్ని పట్టుకున్నారు. ఆగస్టులో మొత్తం 15 కేసుల్లో అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా వారి నుంచి రూ.2,82,500 నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల (DA) కేసుల్లో సోదాలు జరిపి రూ.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. ఆగస్టు (August)లో బ్యూరో 25 కేసులను ఖరారు చేసి ప్రభుత్వానికి తుది నివేదికలను పంపింది.
ACB Raids | ఈ ఏడాదిలో 179 కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఏసీబీ 179 కేసులను నమోదు చేసింది. అందులో 108 ట్రాప్ కేసులు, 11 అసమాన ఆస్తులు, 18 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 18 రెగ్యులర్ ఎంక్వైరీలు, 21 ఆకస్మిక తనిఖీలు మరియు 3 డిస్క్రీట్ ఎంక్వైరీలు ఉన్నాయి. 14 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది.
ACB Raids | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.