అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | ఏసీబీ (ACB) అధికారులు దూకుడు పెంచారు. నిత్యం తనిఖీలు చేపడుతూ అవినీతి అధికారుల పని పడుతున్నారు. సెప్టెంబర్లో ఏకంగా 22 మంది ఏసీబీకి చిక్కారు.
సెప్టెంబర్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మొత్తం 23 కేసులు నమోదు చేసింది. వీటిలో 11 ట్రాప్ కేసులు, 2 అసమాన ఆస్తుల (DA) కేసులు, 2 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 6 రెగ్యులర్ ఎంక్వైరీలు, 2 ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో సహా 22 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో రూ.8,91,000/- మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో రూ.14 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.
ACB Raids | మొత్తం 203 కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఏసీబీ మొత్తం203 కేసులను నమోదు చేసింది. అందులో 119 ట్రాప్ కేసులు (Trap Case), 13 అసమాన ఆస్తుల కేసులు, 20 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 25 రెగ్యులర్ ఎంక్వైరీలు, 23 ఆశ్చర్యకరమైన తనిఖీలు, 3 ఎంక్వైరీలు ఉన్నాయి. 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేట్ వ్యక్తులతో సహా 189 మంది ప్రభుత్వ ఉద్యోగులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. సెప్టెంబర్లో 25 కేసులను ఖరారు చేసి ప్రభుత్వానికి తుది నివేదికలను పంపింది.
ACB Raids | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.