అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల అదనపు కలెక్టర్ (Additional Collector) ఇంట్లో సోదాలు చేపట్టగా.. తాజాగా సస్పెన్షన్‌లో సబ్ రిజిస్ట్రార్ నివాసాలపై దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులు గుర్తించారు.
సస్పెన్షన్‌లో ఉన్న రంగారెడ్డి (Rangareddy) జిల్లా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ (SRO-1) కె. మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ (ACB) ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఈసీఐఎల్ కాప్రాలోని ఆయన నివాసంతో పాటు అతని బంధువులు, స్నేహితులు, బినామీలు ఇతర సహచరులకు చెందిన ఏడు ప్రాంతాల్లో శుక్రవారం సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో అతడి అక్రమాస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. రూ.7.3 కోట్ల ఆస్తులను గుర్తించారు. మార్కెట్ రేటు ప్రకారం వీటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా.
ACB Raid | అక్రమాస్తుల వివరాలు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కాప్రాలోని 300 చదరపు గజాలలోని ఒక ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ ఇల్లు, ఇబ్రహీంపట్నంలోని చింతపల్లిగూడ గ్రామంలో ఒక ఓపెన్ ప్లాట్, పరిగి మండలం నస్కల్ (V)లో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నంలోని మంగళ్‌పల్లి గ్రామంలో ఒక ఎకరం వాణిజ్య భూమి, పరిగి మండలం నస్కల్ (V)లో రూ.1.24 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్ ఉన్న ఒక ఫామ్ హౌస్ సబ్‌రిజిస్ట్రార్ మధూసూదన్‌రెడ్డి సంపాదించినట్లు గుర్తించారు.
సోదాల సమయంలో అధికారులు రూ.9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఒక ఇన్నోవా ఫార్చ్యూనర్ కారు, ఒక వోల్వో XC 60 B5 కారు, ఒక వోక్స్వ్యాగన్ టైగన్ GT ప్లస్ కారు ఆయన పేరిట ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా సదరు అధికారి AO ARK స్పిరిట్స్ పేరుతో మద్యం వ్యాపారంలో దాదాపు రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అతని భార్య మరియు పిల్లల పేరుతో రెండు షెల్ కంపెనీలను ఏర్పాటు చేశాడు.