అక్షరటుడే, కామారెడ్డి: ACB Raids | కామారెడ్డిలోని సమీకృత కార్యాలయాల భవనంలో (Kamareddy Collectorate) ఏసీబీ సోదాలు కలకలం సృష్టించాయి. కలెక్టరేట్లోని సివిల్ సప్లయ్ కార్యాలయంలో (Civil Supplies Office) ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ (ACB DSP Shekhar Goud) ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ACB Raids | సాధారణ వ్యక్తులుగా వచ్చి..
ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరిగా కలెక్టరేట్ మొత్తం తిరిగినట్టుగా తెలుస్తోంది. అనంతరం గంట తర్వాత సివిల్ సప్లయ్స్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది ఫోన్లు తీసుకుని సోదాలు ప్రారంభించినట్టుగా సమాచారం. కార్యాలయ సిబ్బంది ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తారు అనే వివరాలు తీసుకుని కార్యాలయంలోని రికార్డులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆకస్మికంగా ఏసీబీ సోదాలు జరగడం కలకలం రేపింది. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు చేపడుతున్నారా..? లేక ఎవరైనా ఫిర్యాదు చేశారా.. అనేది చర్చనీయాంశంగా మారింది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.