అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారులు (ACB officers) దూకుడు పెంచారు. దీంతో అవినీతి అధికారుల్లో భయం నెలకొంది.
గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఏసీబీ దాడులు (ACB raids) పెరిగాయి. ప్రజల ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు లంచాలు తీసుకుంటున్న అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఎక్కువగా రెవెన్యూ అధికారులే (Revenue officers) ఏసీబీ దాడుల్లో దొరుకుతున్నారు. వివిధ రకాల పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలను రెవెన్యూ అధికారులు లంచాల పేరిట పట్టి పీడిస్తున్నారు. అధికారుల తీరుతో విసిగిపోయిన పలువురు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు.
ACB Raids | మే నెలలో ఎంత మంది చిక్కారంటే..
రాష్ట్రవ్యాప్తంగా మే నెలలో ఏసీబీ 19 కేసులు నమోదు చేసింది. ఇందులో 14 ట్రాప్ కేసులు (trap cases), నాలుగు క్రిమినల్ మిస్ కండక్ట్ కేసులు, ఒక ఆకస్మిక తనిఖీ ఉన్నాయి. మొత్తం 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అరెస్టు చేసింది. రూ.లక్షల్లో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏప్రిల్ నెలలో 16 ఏసీబీ కేసులు నమోదు అయ్యాయి. 2025 సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మొత్తం 112 కేసులను ఏసీబీ నమోదు చేసింది. ఏసీబీ దాడులు, కేసులు పెరగడంతో అవినీతి అధికారుల్లో భయం పట్టుకుంది.
ACB Raids | అవినీతి కేంద్రాలుగా..
రాష్ట్రంలో రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా తహశీల్దార్ ఆఫీసుల్లో ఆపరేటర్ నుంచి మొదలు పెడితే తహశీల్దార్ వరకు ప్రజలను లంచాల కోసం వేధిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB raids) జరుగుతున్నా పలువురు అధికారులు లంచాలు తీసుకోవడానికి భయపడకపోవడం గమనార్హం. ఇటీవల ముషీరాబాద్ తహశీల్దార్ ఆఫీసుల్లో (Musheerabad Tahsildar office) ఓ ఆర్ఐ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఏకంగా రూ.లక్ష లంచం డిమాండ్ చేశాడు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా.. ఆయనను ఏసీబీ అధికారులు (ACB officials) పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తహశీల్ ఆఫీసులో ఆర్గా పని చేసే కృష్ణ ఏడు గుంటల భూమిని పట్టా పాస్‌బుక్కులో నమోదు చేయడానికి రూ.12 లక్షల లంచం అడిగాడు. ఇలా అవినీతి అధికారులు ప్రజలను లంచం కోసం వేధిస్తున్నారు. అయితే ప్రజల్లో అవగాహన పెరిగి ఏసీబీని ఆశ్రయిస్తుండటంతో పలువురు అవినీతి అధికారుల్లో భయం పట్టుకుంది.
ACB Raids | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా తమకు ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే అవినీతి అధికారుల భరతం పడతామని పేర్కొంటున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.