Homeజిల్లాలుకామారెడ్డిACB Raid | చెక్​పోస్ట్​ సిబ్బందిగా ఏసీబీ అధికారులు.. రోజూ మాదిరి లంచాలు ఇచ్చిన డ్రైవర్లు

ACB Raid | చెక్​పోస్ట్​ సిబ్బందిగా ఏసీబీ అధికారులు.. రోజూ మాదిరి లంచాలు ఇచ్చిన డ్రైవర్లు

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : ACB Raid | జిల్లాలోని రాజంపేట మండలం పొందుర్తి ఆర్టీఏ చెక్ పోస్టుపై (Padmanurthi RTA check post) ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు (ACB officials) చెక్​పోస్ట్​లో విధులు నిర్వహించారు. నిత్యం చెక్​పోస్ట్ సిబ్బందికి (check post staff) లంచాలు ఇచ్చే డ్రైవర్లు.. రోజూ మాదిరిగానే డబ్బులు తీసుకెళ్లి ఏసీబీ అధికారులకు అందజేయడం గమనార్హం.

చెక్​పోస్టులో అక్రమంగా వసూళ్లు జరుగుతున్నాయనే సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. చెక్​ పోస్ట్​ సిబ్బంది నియమించుకున్న ప్రైవేట్​ వ్యక్తులు లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అసిస్టెంట్ ఎంవీఐ శ్యామ్, ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనంతరం సిబ్బందిని బయటకు పంపి చెక్​పోస్ట్​ కౌంటర్​లో ఏసీబీ అధికారులు విధులు నిర్వహించారు. వాళ్లు ఏసీబీ అధికారులని తెలియని లారీ డ్రైవర్లు (lorry drivers) రోజూ మాదిరిగానే.. తీసుకెళ్లి లంచాలు ఇచ్చారు.

ACB Raid | వివరాలు నమోదు

డబ్బులు ఇస్తున్న లారీ డ్రైవర్ల వివరాలను ఏసీబీ అధికారులు నమోదు చేసుకున్నారు. గతంలో ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారా.. ఎవరికి ఇచ్చారు.. ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలను ఆరా తీశారు. అవినీతి అధికారుల ఆట కట్టించడానికి ఏసీబీ అధికారులు తీసుకున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ACB Raid | రూ.లక్షల్లో వసూలు

పొందుర్తి చెక్​పోస్టులో (Pondurthi check post) నిత్యం రూ.లక్షల్లో మాముళ్లు వసూలు చేస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అయితే ఏసీబీ అధికారులకు లంచాలు ఇచ్చిన డ్రైవర్ల సమాచారం ఆధారంగా రోజూ ఎంత మేర వసూళ్లు చేస్తారనే వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారుల విచారణ ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలు సాయంత్రం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Must Read
Related News