అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. లంచాలు తీసుకుంటున్న అధికారులు వల పన్ని పట్టుకుట్టున్నారు. అంతేగాకుండా పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు (ACB Raid) చేపడుతున్నారు.
ఏసీబీ అధికారులు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట్లో ఎస్సీ బాలికల హాస్టల్ (Girls Hostel), నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలల్లో (Social Welfare Boys School) ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఆడిటర్ అధికారుల సాయంతో ఆహారం నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థుల వివరాలు, హాస్టళ్ల రికార్డులను తనిఖీ చేశారు.
ACB | చర్యలు తీసుకోవాలని..
సోదాల సమయంలో ఏసీబీ అధికారులు పలు అక్రమాలను గుర్తించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. కాగా చాలా హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం పెట్టడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో కొంతమంది వార్డెన్లు అక్రమాలకు పాల్పడుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టడం గమనార్హం.
ACB | తనిఖీలతో ఆందోళన
సంక్షేమ హాస్టళ్లు, గురుకుల కాలేజీలను గతంలో విద్యా శాఖ అధికారులు మాత్రమే తనిఖీ చేసేవారు. ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తుండటంతో అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనని భయపడుతున్నారు.
ACB | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.