అక్షరటుడే, ఇందూరు : DEO Office | జిల్లా విద్యాశాఖలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఏసీబీ నజర్ పెట్టింది. ఇందులో భాగంగా గతంలో జరిగిన అవకతవకలపై అధికారులు (ACB Officers) విచారణ చేపట్టినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించినట్లు తెలిసింది.
జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో (District Education Office) ఏదో ఒక ఘటన వెలుగు చూస్తూనే ఉంది. ఆది నుంచి అవినీతిపై పలు ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. అయితే దీనిపై ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. గతంలోనూ పలుమార్లు ఆయా అంశాల్లో అవినీతి జరిగిందని తెలుసుకొని ఏసీబీ ఉన్నతాధికారులు పలువురిని విచారించారు. అయితే ఇటీవల మూడు రోజుల క్రితం కార్యాలయంలోని ఓ సీనియర్ అసిస్టెంట్, అలాగే సర్వశిక్ష అభియాన్లో (Sarva Shiksha Abhiyaan) గతంలో విధులు నిర్వహించిన ఓ ఉద్యోగిపై విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే వీరిరువురు గత డీఈవో హయాంలో చేసిన అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ అధికారులు విచారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం డీఈవో కార్యాలయంలో చర్చనీయాంశమైంది.
DEO Office | చేతులు తడపాల్సిందే..
ఏసీబీ అధికారులు గతంలోనూ పలుమార్లు డీఈవో కార్యాలయంలోని (DEO Office) ఉద్యోగులపై విచారణ చేపట్టారు. అయినా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఇటీవల ప్రైవేటు పాఠశాల రెన్యువల్ కోసం డబ్బులు డిమాండ్ చేయడం, చివరికి కార్యాలయంలోని సిబ్బంది పదవీ విరమణ చేస్తే వారి బిల్లులను పాస్ చేయడానికి సైతం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి. కార్యాలయంలో అధికారుల చేతులు తడిపితేనే పనులు చేస్తారనే విమర్శలు ఉన్నాయి.
కార్యాలయంలోని ఓ జూనియర్ అసిస్టెంట్ తనకు ఆదాయం ఉండే సెక్షన్ ఇవ్వాలని బాహాటంగానే ఉన్నతాధికారులతో చెప్పడం విస్మయానికి గురి చేసింది. అంటే అవినీతి ఎంతగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత డీఈవో ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులు మాత్రం యథేచ్ఛగా తమ పని కానిస్తున్నారు. అవినీతి అధికారులపై డీఈవో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఏసీబీ అధికారుల విచారణతో విద్యాశాఖలో అవినీతి అంశం మరోసారి చర్చనీయాంశమైంది.