అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రాజెక్ట్ అక్రమాలపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులు ఏసీబీకి లేఖ రాశారు.
కాళేశ్వరం అక్రమాలపై ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) విచారణ చేపట్టి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక విచారణను కూడా ప్రారంభించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయనుంది. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగనుండటం గమనార్హం.
Kaleshwaram Project | ప్రభుత్వం అనుమతిస్తే..
కాళేశ్వరం నిర్మాణం పేరిట బీఆర్ఎస్ హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) గతంలో పలుమార్లు ఆరోపించారు. ఘోష్ కమిషన్ కూడా అక్రమాలపై పూర్తి వివరాలు నివేదిక రూపంలో సమర్పించింది. అయితే సీబీఐ దర్యాప్తు జరుపుతుండగా.. ఏసీబీకి విజిలెన్స్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంట్రాక్టర్ల నుంచి బాధ్యులు ఎలా లబ్ధి పొందారో విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులు ఏసీబీని కోరారు. ఈ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఏసీబీ డీజీ పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఏసీబీ విచారణ(ACB Investigation) ప్రారంభించనుంది.
Kaleshwaram Project | సీబీఐ విచారణ షురూ
కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) నిర్మాణంలో భాగంగా సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ప్రాజెక్ట్‌లో అవకతవకలు, నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేపడుతున్నారు. ఎన్డీఎస్ఏ, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో విజిలెన్స్ కమిషన్ ఏసీబీకి లేఖ రాయడం గమనార్హం.