అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా.. తహశీల్దార్‌ను ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండ్డెగా పట్టుకున్నారు.
అవినీతి అధికారులు మారడం లేదు. ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. ముఖ్యంగా తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు కడతారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా నల్లగొండ (Nalgonda) జిల్లా చిట్యాల మండల తహశీల్దార్ (Chityal Tahsildar) గుగులోతు కృష్ణ ఏసీబీకి చిక్కాడు. M/s రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి, మరొక వ్యవసాయ భూమి సర్వే నివేదికను చిట్యాల సబ్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించడం కోసం తహశీల్దార్ రూ.రెండు లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ (ACB) అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. తహశీల్దార్ కృష్ణ, ప్రైవేట్ వ్యక్తి గట్టు రమేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.