HomeUncategorizedACB Raid | ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన...

ACB Raid | ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు(Corrupt Officers) రెచ్చిపోతున్నారు. స్థాయిని బట్టి రూ. వేల నుంచి రూ.కోట్ల వరకు లంచాలు డిమాండ్​ చేస్తున్నారు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే.. కాంట్రాక్టర్ల వరకు ఎవరిని వదలడం లేదు. తాజాగా ఓ అధికారి ఏకంగా రూ.ఐదు కోట్ల(Rs. Five Crore) లంచం డిమాండ్​ చేశారు. అందులో రూ.25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లోని గిరిజన సంక్షేమ శాఖ ఈఎన్‌సీ శ్రీనివాస్‌ ఓ కాంట్రాక్టరు నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు(ACB Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. విశాఖపట్నంకు చెందిన సబ్బవరపు శ్రీనివాస్‌ విజయవాడలో గల గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ కార్యాలయంలో ఈఎన్​సీగా పని చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం(Central Government) రాష్ట్రాలకు ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో పాఠశాల భవన నిర్మాణ పనులను వైజాగ్​కు చెందిన శ్రీసత్యసాయి కన్‌స్ట్రక్షన్స్‌(Sri Sathya Sai Constructions) అధినేత సీహెచ్‌ కృష్ణంరాజు దక్కించుకున్నారు. మొత్తం మూడు పాఠశాలల భవనాలను ఆయన నిర్మించాడు. ఇందుకు సంబంధించి సదరు కాంట్రాక్టర్​కు రూ.35.50 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. అయితే ఆ బిల్లులు చెల్లించడానికి ఈఎన్​సీ రూ.5 కోట్ల లంచం డిమాండ్​ చేశాడు.

ACB Raid | చస్తే చావు..

కృష్ణంరాజు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని పాఠశాల భవనాలు(School Buildings) నిర్మించాడు. అయితే లోన్లు కట్టకపోవడంతో ఆయనపై బ్యాంకులు ఒత్తిడి చేశాయి. అంతేగాకుండా ఆయన ఆస్తులను వేలం వేస్తామని ప్రకటించాయి. దీంతో ఆయన ఈఎన్​సీ దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు. బిల్లులు చెల్లించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయాయి. అయినా సదరు అధికారి కరగకపోగా.. చస్తే చావు అని చెప్పడం గమనార్హం. తనకు రూ.5 కోట్లు ఇస్తేనే బిల్లులు చెల్లిస్తానని చెప్పాడు. ముందుగా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఈఎన్​సీ శ్రీనివాస్(ENC Srinivas)​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెగ్​గా పట్టుకున్నారు. కాగా ఈఎన్​సీ శ్రీనివాస్​ మరో మూడు వారాల్లో రిటైర్మెంట్​ కానున్నాడు.

ACB Raid | గతంలో రెండు చిక్కినా మారని తీరు

శ్రీనివాస్​ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇది మూడో సారి కావడం గమనార్హం. గతంలో రెండు సార్లు ఏసీబీ అధికారులు పట్టుకున్నా ఆయనలో మార్పు రాలేదు. 2001లో వైజాగ్​లో ఏఈగా పనిచేస్తున్నప్పుడు మొదటి సారి ఏసీబీకి చిక్కాడు. 2014లో శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా ఉన్న సమయంలో సైతం లంచం తీసుకుంటూ దొరికాడు. తాజాగా మరోసారి దొరకడం గమనార్హం. అయితే రెండు సార్లు ఏసీబీకి చిక్కిన అధికారికి ఈఎన్​సీ పోస్టు ఎలా ఇచ్చారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏసీబీకి చిక్కిన అధికారుల విషయంలో కఠిన చర్యలు లేకపోవడంతోనే వారు రెచ్చిపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లంచాలు తీసుకొని దొరికిన అధికారులను జైలుశిక్షతో పాటు మళ్లీ ఉద్యోగం ఇవ్వొద్దని ప్రజలు కోరుతున్నారు.