అక్షరటుడే, వెబ్డెస్క్: ACB | అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) (ఏసీబీ) దూకుడు పెంచింది. లంచావతారుల ఆట కట్టిస్తోంది. సగటున రోజుకో కేసు నమోదు చేస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల్లో మార్పు రావడం లేదు. ఏళ్ల తరబడి విచారణలు కొనసాగడం, కఠిన చర్యలు లేకపోవడంతో ఉద్యోగుల్లో భయమన్నదే లేకుండా పోయింది.
విధులు నిర్వర్తించేందుకు వేతనాలు తీసుకుంటున్న అధికారులు.. ఏ పని చేయాలన్నా చేతులు చాస్తున్నారు. ప్రజలను పీడించుకు తింటున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) చేస్తూ పట్టుకుంటూ కేసులు పెడుతున్నా లెక్క చేయడం లేదు. నాలుగు నెలలు సస్పెండ్ చేస్తారు తప్పితే అంతకు మించి కఠిన చర్యలు ఉండవన్న ధీమాతో వెనక్కి తగ్గడం లేదు. మరింత జోరు పెంచుతున్నారు. లంచం తీసుకుని పట్టుబడితే ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించడం, బెయిల్ రాకుండా ఉండేలా క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలులో పెడితే తప్ప అవినీతిపరుల్లో మార్పు రాదన్నది వాస్తవం.
ACB | రోజుకో కేసు నమోదు..
కొద్దిరోజులుగా ఏసీబీ స్వేచ్ఛగా పని చేస్తోంది. ఫలితంగా రోజుకో కేసు నమోదవుతోంది. ఒక్క ఆగస్టు నెలలోనే 31 మంది లంచావతారుల పని పట్టింది. ఇందులో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించి ఆస్తుల కేసులు, మూడు క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, ఏడు రెగ్యులర్ ఎంక్వైరీలు నాలుగు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి. నలుగురు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు (outsourcing employees) సహా 22 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రూ.2,82,500 నగదును స్వాధీనం చేసుకున్న అవినీతి నిరోధక శాఖ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో రూ.5.13 కోట్ల విలువైన ఆస్తిని బయటకు తీసింది.
ACB | 8 నెలల్లో చిక్కిన 167 మంది అరెస్టు..
గత జనవరి నుంచి ఆగస్టు వరకు ఏసీబీ రాష్ట్రవ్యాప్తంగా 179 కేసులను నమోదు చేసింది, 108 ట్రాప్ కేసులు, 11 ఆదాయానికి మించి ఆస్తుల కేసులు, 18 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 18 రెగ్యులర్ ఎంక్వైరీలు, 21 ఆకస్మిక తనిఖీలు, మూడు ఎంక్వైరీలు ఉన్నాయి. 14 మంది అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సహా 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను పట్టుకుని రిమాండ్ చేశారు. రూ.33.12 లక్షల ఆస్తులు స్వాధీనం చేసుకోగా, రూ.44.30 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించింది.
ACB | అన్ని విభాగాల్లోనూ అంతే..
ప్రభుత్వ శాఖల్లో (government departments) అంతులేని అవినీతి పెరిగిపోయింది. ఏ శాఖలో అయినా పని కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే. లేకపోతే పని కాదు.. ఫైల్ ముందుకు సాగదు. రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ వంటి కీలక శాఖల్లో లంచాల దందా పెరిగిపోయింది. ఏదైనా సర్టిఫికెట్ కావాలన్నా, బిల్లు రావాలన్నా, ఫైల్ ముందుకు కదలాలన్న పైకం ఇస్తేనే సరి. లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కింది స్థాయి నుంచి పైదాకా అంతా అవినీతి పర్వమే. ఈ నేపథ్యంలో లంచాలు ఇవ్వలేని కొంత మంది ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. పైసల కక్కుర్తితో పని చేయకుండా వేధిస్తున్న ఉద్యోగుల ఆట కట్టిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ఏసీబీ కేసుల (ACB cases) సంఖ్య పెరిగింది.
ACB | కఠిన చర్యలు లేకే..
లంచావతారులపై కఠిన చర్యలు కరువయ్యాయి. దీంతో వారిలో భయం లేకుండా పోయింది. ఏసీబీకి పట్టుబడుతున్న ఉద్యోగులు.. నాలుగు రోజులు సస్పెన్షన్‌కు గురవుతున్నారు. ఆ తర్వాత పై అధికారులను మచ్చిక చేసుకుని సస్పెన్షన్ ఎత్తేయించుకుని విధుల్లో చేరుతున్నారు. కేసుల నమోదు మీద దృష్టి సారిస్తున్న ఏసీబీ.. నిందితులకు న్యాయస్థానంలో కఠిన శిక్షలు విధించేలా చేయడంలో విఫలమవుతోంది. ఏళ్ల తరబడి కేసుల విచారణ కొనసాగుతుండడం కూడా అక్రమార్కులకు కలిసి వస్తోంది. మరోవైపు, ప్రభుత్వం వైపు నుంచి కూడా క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది.
ఇటీవల ఏసీబీకి పట్టుబడిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో (Nizamabad Municipal Corporation) పని చేసే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గతంలోనూ ఒకసారి లంచం తీసుకుంటూ దొరికాడు. ఏదో మొక్కుబడిగా సస్పెండ్ చేసిన అధికారులు.. ఆ తర్వాత ఎత్తేయడంతో విధుల్లో చేరాడు. మళ్లీ లంచాలు తీసుకోవడం మొదలు పెట్టాడు. మొదటిసారి తప్పు చేసినప్పుడే అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించి ఉంటే మిగతా వారు భయపడే వారు. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో అక్రమార్కులకు అడ్డే లేకుండా పోయింది. ఏసీబీకి దొరికితే నాలుగు రోజులు సస్పెండ్ చేస్తారు తప్పితే ఉద్యోగం పోదన్న ధీమాలో ఉద్యోగులు, అధికారులు ఉన్నారు.
