అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Cases | రాష్ట్రంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్న అధికారులను వల పన్ని పట్టుకుంటున్నారు. అక్రమాలు ఎక్కువగా జరుగుతున్న ఆఫీసులపై దాడులు చేపడుతున్నారు. జులై నెలలో ఏసీబీ అధికారులు(ACB Officers) మొత్తం 22 కేసులు నమోదు చేశారు. వీటిలో 13 ట్రాప్ కేసులు, ఒక అసమాన ఆస్తుల, ఒక క్రిమినల్ దుష్ప్రవర్తన, ఒక రెగ్యులర్ ఎంక్వైరీ, ఆరు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయి.
ACB Cases | 20 మంది అరెస్ట్
ఏసీబీ దాడుల్లో(ACB Raids) జులైలో మొత్తం 20 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తి, 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారిని కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించింది. ట్రాప్ కేసుల్లో రూ.5.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసులో రూ.11.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. కామారెడ్డి(Kamareddy) జిల్లా పొందుర్తి ఆర్టీఏ చెక్‌పోస్టు, సదాశివపేట, బీబీనగర్, జడ్చర్ల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మికంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.1,49,880 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ACB Cases | ఇప్పటి వరకు 148 కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు ఏసీబీ 148 కేసులను నమోదు చేసింది. పది మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు/ప్రైవేట్ వ్యక్తులతో సహా 145 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. ట్రాప్ కేసుల్లో రూ.30.32 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాస్తుల కేసుల్లో రూ.39 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.
ACB Cases | ప్రజలకు అవగాహన
ఏసీబీ అధికారులు అవినీతి నిర్మూలన(Eradication of Corruption) కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో 1064కు కాల్ చేయాలని పోస్టర్లు, స్టిక్కర్లు అతికిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవినీతిపై అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు.
ACB Cases | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.