అక్షరటుడే, ఇందూరు : ABVP Nizamabad | ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ఇందూరు విభాగ్ కన్వీనర్ శశిధర్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నగర శివారులోని విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాల (Vijay Rural Engineering College) ఎదుట సోమవారం రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) విడుదల చేయకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. విద్యార్థులు ఉద్యమం చేస్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.
తెలంగాణ (Telangana)లో డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ.. రాష్ట్రాన్ని, ప్రజలను కేవలం మాటలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్చుకుంటారని పేర్కొన్నారు. బకాయిలు పేరుకుపోవడంతో కళాశాల యాజమాన్యాలు తీవ్రఒత్తిడికి గురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి, కంఠేశ్వర్ జోనల్ ఇన్ఛార్జి దుర్గాదాస్, సన్నీ, సిద్దు, విగ్నేష్, టోనీ, కార్తీక్, హరీష్, అఖిలేష్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
