అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గర్భం దాల్చిన యువతికి అబార్షన్ చేసిన ఘటనను ‘అక్షరటుడే’ (Akshara today) వెలుగులోకి తీసుకురాగా ఈ ఘటనపై పోలీసులు విచారణ వేగంగా కొనసాగుతోంది. వారం రోజులుగా ఇటు వైద్యాధికారులు, అటు పోలీసుల విచారణలో ఓ గైనకాలజిస్టు (gynecologist) అబార్షన్ చేసినట్టుగా తేలింది.
Kamareddy | మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో..
కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ ఈ అబార్షన్ చేసినట్లుగా గుర్తించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తాడ్వాయి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి గత నెల 27న కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. సంబంధిత ఆస్పత్రి గైనకాలజిస్టు ఓ స్కానింగ్ సెంటర్‌కు పరీక్షల నిమిత్తం రాయగా ఆ యువతి స్కానింగ్ సెంటర్లో (scanning center) పరీక్షలు చేసుకుని మరుసటి రోజు గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లగా ఆ యువతికి అబార్షన్ చేసింది.
Kamareddy | పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ..?
ఈ విషయం పోలీసులు, వైద్యాధికారుల విచారణలో తేలినట్టుగా తెలుస్తోంది. సదరు ఆస్పత్రి మేనేజ్మెంట్ కూడా సోమవారం తాడ్వాయి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించినట్లుగా సమాచారం. ఎర్రపహాడ్ మెడికల్ ఆఫీసర్, సంబంధిత గ్రామ ఆశావర్కర్, ఏఎన్ఎం ద్వారా జిల్లా వైద్యాధికారి దివ్య నివేదిక తెప్పించుకుని మంగళవారం అబార్షన్ చేసిన ఆస్పత్రి, గైనకలజిస్ట్తో పాటు స్కానింగ్ సెంటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిసింది.
Kamareddy | అనుమతి లేకున్నప్పటికీ..
అయితే ఆస్పత్రుల్లో అబార్షన్ చేయాలంటే సంబంధిత ఆస్పత్రికి డీఆర్ఏ అనుమతి ఉండాలి. అలాగే అబార్షన్ చేసే వైద్యురాలికి ఎంటీపీ యాక్ట్ కింద అనుమతి ఉంటేనే అబార్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే సదరు గైనకాలజిస్ట్ గత నెల చివరి వారంలో ఎంటీపీ కింద జిల్లా వైద్యాధికారికి (District Medical Officer) అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా అనుమతి రావాల్సి ఉన్నట్టుగా సమాచారం. ఎలాంటి అనుమతి లేకుండానే సదరు గైనకాలజిస్ట్ అబార్షన్ చేసినట్టుగా సమాచారం. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెళ్లి కాకుండా యువతి గర్భం దాల్చి ఆమెకు అబార్షన్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా ఆ యువతి తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇక్కడ తల్లిదండ్రులకు తెలియకుండానే అబార్షన్ చేసినట్టుగా సమాచారం.
Kamareddy | ఆస్పత్రి సీజ్ చేస్తారా..?
అయితే మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ కాగా మూడు రోజుల వ్యవధిలో సదరు ఆస్పత్రి, గైనకాలజిస్ట్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆస్పత్రి సీజ్ చేయడమా లేక ఫైన్ వేయడమా అనేది తేలనుంది. ఇప్పటికే ఈ ఘటనపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదు కాగా ఎల్లారెడ్డి డీఎస్పీ (Yellareddy DSP) విచారణ జరుపుతున్నారు. రేపోమాపో ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే సదరు ఆస్పత్రి యాజమాన్యం మాత్రం తమపై కేసు కాకుండా ఉండేందుకు, ఆస్పత్రిపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సదరు ఆస్పత్రిపై ఇటు పోలీసులు, అటు వైద్యాధికారులు చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది రెండు రోజుల్లో తేలనుంది.