Homeక్రీడలుAsia Cup | ఫైన‌ల్‌కి ముందు టీమిండియాకి గాయాల టెన్ష‌న్.. ఆ ఇద్ద‌రు పాక్‌తో ఫైన‌ల్...

Asia Cup | ఫైన‌ల్‌కి ముందు టీమిండియాకి గాయాల టెన్ష‌న్.. ఆ ఇద్ద‌రు పాక్‌తో ఫైన‌ల్ ఆడ‌తారా, లేదా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అజేయంగా దూసుకెళ్తున్న టీమ్ ఇండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. వరుస విజయాలతో ఆకట్టుకుంటూ వచ్చిన భారత్‌ జట్టు రేపు (ఆదివారం) పాకిస్తాన్‌తో టైటిల్ పోరులో తలపడనుంది.

ఇప్పటివరకు పాక్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలుపొందింది. రెండింటిలోనూ ప్రత్యర్థికి పోటీ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రేపటి ఫైనల్‌లో కూడా భారత్‌కే మెరుగైన విజయావకాశాలున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Asia Cup | గాయాల భయం

అయితే, టైటిల్ మ్యాచ్ ముందు టీమ్ ఇండియా(Team India)కు గాయాల బెడద కలవర పెడుతోంది. ఆసియా కప్‌లో సంచలన ప్రదర్శనలు ఇస్తున్న యువ బ్యాటర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma), కీలక ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్వల్ప గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరూ కూడా ఫైనల్‌కు అందుబాటులో ఉండకపోతే జట్టుపై చాలా ప్ర‌భావం చూపుతుంద‌న్న‌ ఆందోళన అభిమానుల్లో ఉంది. నిన్న జరిగిన శ్రీలంకతో చివరి లీగ్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు. హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్ వేసి ఒక వికెట్ తీసిన తర్వాత మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. దాంతో, వీరిద్దరికి గాయాలు కావ‌డం వ‌ల్లే ఫీల్డింగ్ చేయ‌లేక‌పోయార‌నే వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీడియాతో మాట్లాడారు. “ఇద్దరికీ పెద్ద గాయాలేమీ లేవు. హార్దిక్ పాండ్యా(Hardik Pandya)కు దుబాయ్ వాతావరణం వల్ల కండరాల పట్టివేత వచ్చిందని, అభిషేక్ శర్మ క్రాంప్స్‌తో బాధపడుతున్నాడని” తెలిపారు. “వాళ్లిద్దరూ ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నారు. మసాజ్ సెషన్లు, రిలాక్సేషన్ టెక్నిక్స్‌లో పాల్గొంటున్నారు. శనివారం ఫిట్‌నెస్ టెస్టు తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పటివరకు పరిస్థితి బాగానే ఉంది. భయపడాల్సిన అవసరం లేదు” అని స్పష్టత ఇచ్చారు. టీమ్ ఇండియా ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ఉంది. యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞుల ప్రదర్శన జట్టుకు అదనపు బలం ఇస్తోంది. ముఖ్యంగా పాక్‌(Pakistan)పై ఇప్పటికే రెండు విజయాలు నమోదు చేయడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గాయాల సమస్యలు పెద్దగా లేకుండా ఉంటే రేపటి మ్యాచ్‌లోనూ టీమ్ ఇండియా మెరుపులు మెరిపించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Must Read
Related News