అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | బీహార్ ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) నేపథ్యంలో ఆధార్ కార్డును గుర్తింపుగా పరిగణించాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని సోమవారం ఆదేశించింది.
బీహార్ సవరించిన ఓటర్ల జాబితాలో చేర్చడానికి గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డు(Aadhar Card)ను “12వ పత్రం”గా పరిగణించాలని స్పష్టం చేసింది. అయితే, ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని పునరుద్ఘాటించింది. ఓటర్ల ఆధార్ కార్డు ప్రామాణికత, వాస్తవికతను ధ్రువీకరించే హక్కు అధికారులకు ఉంటుందని కూడా తెలిపింది. బీహార్ SIR ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం మరోసారి విచారించిన సుప్రీంకోర్టు(Supreme Court) ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. “ఆధార్ చట్టం 2016 కింద జారీ చేయబడిన ఆధార్ కార్డును సవరించిన ఎన్నికల జాబితా ప్రక్రియలో నిర్వహిస్తున్న మినహాయింపు నుంచి లేదా చేర్చడానికి గుర్తింపుగా అంగీకరిస్తారు. దానిని 12వ పత్రంగా పరిగణిస్తారు” అని న్యాయమూర్తులు సూర్యకాంత్, జోయ్మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
Supreme Court | అర్హులకు ఓటు హక్కు కల్పించాల్సిందే..
బీహార్ SIR నేపథ్యంలో ప్రస్తుతం ఓటర్లు తమ గణన ఫారమ్లతో పాటు సమర్పించాల్సిన 11 నిర్దేశించిన పత్రాలు ఉన్నాయి. ఆధార్ కార్డును 12వ గుర్తింపు పరిగణించాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల జాబితాలో అక్రమ వలసదారులను చేర్చాలని ఎవరూ కోరుకోవడం లేదన్న ధర్మాసనం.. నిజమైన పౌరులు మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాల్సి ఉందన్నారు. నకిలీ పత్రాల ఆధారంగా నిజమైన వారని చెప్పుకునే వారిని ఓటర్ల జాబితా నుండి తొలగిస్తామని స్పష్టంగా చెప్పాలని పేర్కొంది. గుర్తింపు రుజువు కోసం ఆధార్ను పత్రంగా అంగీకరించడానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనం ఈసీ(Election Commission)కి సూచించింది.
Supreme Court | 99.6 శాతం వెరిఫికేషన్ పూర్తి
ఓటర్ల నుంచి ఆధార్ కార్డును అంగీకరించనందుకు పోల్ అధికారులకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల(Show Cause Notice)పై సుప్రీంకోర్టు ఈసీ వివరణ కోరింది. ముసాయిదా జాబితాలో 7.24 కోట్ల మంది ఓటర్లలో 99.6 శాతం మంది పత్రాలను సమర్పించారని ఈసీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది చెప్పారు. ఆధార్ను 12వ పత్రంగా చేర్చాలని పిటిషనర్లు కోరడం ఎందుకని ప్రశ్నించారు. పాస్ పోర్టుకు ఉన్నటువంటి చట్టబద్ధత ఆధార్ కు లేదన్నారు. ఆచరణాత్మక ప్రయోజనాన్ని అందించరని తెలిపారు. 2016 ఆధార్ చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ఈ సందర్భంగా బెంచ్ ప్రస్తావించింది. ఇది పౌరసత్వ రుజువు కాదని, గుర్తింపు రుజువుగా పరిగణించవచ్చని పేర్కొంది.