అక్షరటుడే, వెబ్డెస్క్: Ola Ride | ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ సర్వీసెస్(Cab services) అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రజలు తాము ఉన్న చోటు నుంచే ఫోన్ ద్వారా ఆయా క్యాబ్, బైక్ సర్వీసులను బుక్ చేసుకొని గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సాధారణంగా దూర ప్రాంతాలు, రద్దీ ప్రాంతాలకు వెళ్లడానికి ఇలాంటి సర్వీస్లను బుక్ చేసుకుంటారు. అయితే ఓ యువతి మాత్రం కేవలం రెండు నిమిషాల్లో వెళ్లే దూరానికి ఓలా బైక్(Ola Bike) బుక్ చేసుకుంది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని లక్నోలో 180 మీటర్ల దూరం వెళ్లడానికి ఓ యువతి ఓలా బైక్ బుక్ చేసుకుంది. రెండు నిమిషాల్లో చేరుకునే దూరానికి ఎందుకు బుక్ చేసుకున్నారని రైడర్ అడిగాడు. ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యాడు. దూరం తక్కువే అయినా.. కుక్కలు(Dogs) ఎక్కువ అని చెప్పింది. కుక్కల బెడద ఉండడంతో రైడ్ బుక్ చేసుకున్నా అంటూ సదరు యువతి జవాబు చెప్పింది. దీంతో అవాక్కయిన రైడర్ ఆ అమ్మాయిని బైక్‌పై ఎక్కించుకొని గమ్యస్థానంలో దింపాడు. ఆ దూరానికి రూ.19 బిల్లు కాగా ఆమె చెల్లించి వెళ్లిపోయింది.
ప్రస్తుతం నగరాల నుంచి మొదలుకుంటే గ్రామాల వరకు కుక్కల బెడద అధికంగా ఉంది. ఒంటరిగా చిన్నారులు కనిపిస్తే శునకాలు దాడులకు పాల్పడుతున్నాయి. గుంపులుగా ఉన్న కుక్కల పెద్దవారిపై సైతం దాడి చేస్తున్నాయి. తెలంగాణ(Telangana)లో కుక్కల దాడిలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కుక్కల బెడద నుంచి తప్పించుకోవడానికి లక్నోలో యువతి ఓలా రైడ్ బుక్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.