అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఏడేళ్ల కుమార్తెను బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి విసిరేసింది. తీవ్రంగా గాయపడ్డ చిన్నారి మృతి చెందింది.
మాల్కాజ్గిరి (Malkajgiri) వసంతపురి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా గురుకృప అపార్ట్మెంట్ (Gurukrupa Apartment)లో మోనాలిసా అనే మహిళ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. ఆమె తన కుమార్తె షారోని మేరిని బిల్డింగ్ పైనుంచి పడేసింది. దీంతో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
Hyderabad | కేసు నమోదు
ఈ ఘటనపై మల్కాజ్గిరి పోలీసులు (Malkajgiri Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మోనాలిసా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికులు స్పందిస్తూ ఒక్కసారిగా పాప పైనుంచి కింద పడిందన్నారు. తాము ఏదో వస్తువు పడినట్లు భావించామని, అయితే కింద చూసే సరికి పాప ఉందన్నారు. తాము కిందకు వెళ్లేవారకు పాప రక్తం మడుగులో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. ఇటీవల వారి కుటుంబంలో ఏవో గొడవలు జరిగాయని చెప్పారు.
Hyderabad | మమకారం మరుస్తున్నారు
రాష్ట్రంలో ఇటీవల పలువురు కన్న పిల్లలను చంపడానికి వెనుకాడటం లేదు. క్షణికావేశం, వివాహేతర సంబంధాలు, మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు.. కారణం ఏదైనా మమకారం తెంచుకొని బిడ్డలను చంపేస్తున్నారు. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లె తల్లులు వారి ప్రాణాలు తీస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా క్షణికావేశంలో పలువురు తమ పిల్లలను చంపి వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనల నివారణకు ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.