అక్షరటుడే, కామారెడ్డి : Tiger | కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో పెద్దపులి సంచారం రైతులు, ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దోమకొండ మండలంలోని (Domakonda Mandal) అంబారిపేట శివారులో పెద్దపులి దూడలపై దాడి చేసినట్లు అక్కడి రైతులు పేర్కొంటున్నారు.
Tiger | దూడలపై దాడిచేసి..
అంబారిపేట గ్రామానికి చెందిన స్వామి గౌడ్ అనే రైతుకు చెందిన దూడలపై పెద్దపులి దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. దూడలపై దాడి జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. పెద్దపులి సంచరించిన ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు (Forest Officers) ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ట్రాక్ కెమెరాలో పెద్దపులి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయని తెలుస్తోంది. దీంతో అంబర్ పేట శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
Tiger | జంకుతున్న ప్రజలు..
పెద్దపులి సంచారంతో పశువుల కాపరులు, వ్యవసాయ పనులు చేసుకునే వారు పొలాల వైపు వెళ్లడానికి జంకుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. గత జులై నెలలో రెడ్డిపేట తండా శివారులో పెద్దపులి సంచారం కలకలం రేపింది. పెద్దపులిపై విషప్రయోగం చేశారన్న ఆరోపణలపై ముగ్గురిని అరెస్ట్ చేసి జైలుకు సైతం తరలించారు. ఉమ్మడి జిల్లా అటవీశాఖ అధికారులు ఆపరేషన్ టైగర్ (Operation Tiger) పేరిట పెద్దపులి కోసం జల్లెడ పట్టినా దాని జాడ కనిపించలేదు. అయితే పెద్దపులి క్షేమంగా వేరే ప్రాంతానికి చేరి ఉంటుందని తెలియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ ఐదు నెలల తర్వాత పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.

Tiger | అంబారిపేట శివారులో పెద్దపులి సంచారం: ట్రాక్ కెమెరాలో రికార్డయిన కదలికలు