అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ఇండియా (INDIA) కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Justice Sudarshan Reddy) పేరును ప్రకటించడం హర్షణీయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ (Hyderabad)లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మంగళవారం ఉదయం ఇండియా కూటమి సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఇది తెలుగు ప్రజల ప్రతిష్టను పెంచే నిర్ణయమన్నారు. తెలుగు వ్యక్తిని గెలిపించుకోవడానికి రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 42 మంది లోక్‌సభ ఎంపీలు, 18 రాజ్యసభ సభ్యులు జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్, పవన్, అసదుద్దీన్ ఒవైసీ ముందుకు వచ్చి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు.
CM Revanth Reddy | రాజ్యాంగాన్ని రక్షించడం కోసం..
రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయకోవిదుడు అవసరమని సీఎం పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తమ పార్టీ ప్రతినిధి కాదన్నారు. ఆయనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఎన్డీఏ (NDA) అభ్యర్థి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని సీఎం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను ఎన్డీఏ కూటమి అపహాస్యం చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ రక్షణ కోసం తమ కూటమి పోరాడుతుందని ఆయన అన్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర చేస్తున్న వారిని ఓడించాలన్నారు.
CM Revanth Reddy | బీసీ బిల్లు ఆమోదం పొందాలంటే..
తెలంగాణ పంపిన బీసీ రిజర్వేషన్ (BC Reservation) బిల్లులు ఆమోదం పొందాలంటే సుదర్శన్‌రెడ్డి గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఆయన ఎంతో కృషి చేశారని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్నారు.